న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జడ్జీలకు కేసుల కేటాయింపు విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కున్న నిర్వహణ అధికారాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా ఉన్న సీజేఐ ఇతర జడ్జీలకు కేసుల కేటాయింపులో అనుసరిస్తున్న నిబంధనలు, విధివిధానాలపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. శాంతిభూషణ్ తరఫున ఆయన కొడుకు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో పిల్ వేశారు.
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాసిన ప్రశాంత్.. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిల్ విచారణకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా సున్నితమైన, అధికార/ప్రతిపక్ష పార్టీలకు చెందిన కేసుల్ని నచ్చినవారికి కేటాయిస్తూ సీజేఐ, రిజిస్ట్రార్‌లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పిటిషన్‌లో సీజేఐ జస్టిస్ మిశ్రాను ప్రతివాదిగా చేర్చారు. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయనీ, సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా కేసుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు జనవరి 12న మీడియా ముందుకొచ్చిన నేపథ్యంలో తాజాగా అదే అంశంపై పిల్ దాఖలుకావడం గమనార్హం.
బహుభార్యత్వం కంటే అయోధ్య కేసే ముఖ్యం
అయోధ్య–బాబ్రీ మసీదు కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన తర్వాతే కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టులో ముస్లిం ప్రతినిధుల తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు విన్పిస్తూ.. ‘ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం సమస్య విచారణ కంటే అయోధ్య–బాబ్రీ మసీదు కేసు విచారణ ముఖ్యమైనది. ఈ సమస్య పరిష్కారమవ్వాలని దేశం కోరుకుంటోంది’ అని అన్నారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment