పుష్కరనగర్లు నత్తనడక
పుష్కర నగర్ల ఏర్పాటులో అధికారగణం అలసత్వం ప్రదర్శిస్తోంది. పుష్కర మహోత్సవం ప్రారంభానికి పక్షం రోజుల గడువు కూడా లేని తరుణంలో పనులు నత్తనడకన సాగడం భక్తులను నివ్వెరపరుస్తోంది. భక్తజనం భారీగా విజయవాడ ఘాట్లకు తరలివస్తారని అంచనా వేసినా.. ఆ దిశగా పుష్కర నగర్ పనులను వేగిర పరచడంలో సఫలీకృతులు కాలేకపోవడం సత్వరమే ఆలోచించవలసిన విషయమని అవగతమవుతోంది.
సాక్షి, విజయవాడ :
దూరప్రాంతాల నుంచి పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల కోసం పుష్కర నగర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36 పుష్కర నగర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడపైపే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి ఇక్కడ 15 పుష్కర నగర్లు నిర్మిస్తున్నారు. పుష్కరాలకు పట్టుమని పక్షం రోజులు లేనప్పటికీ ఇప్పటికీ ఒక్క పుష్కరనగర్ కూడా సిద్ధం కాలేదు. వచ్చే నెల 10వ తేదీలోగా పుష్కర నగర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
పుష్కరనగర్ల వివరాలు....
విజయవాడలో 15, జగ్గయ్యపేటలో రెండు, చందర్లపాడులో రెండు, ఇబ్రహీంపట్నంలో ఐదు, విజయవాడరూరల్లో 3, పెనమలూరులో ఒకటి, మోపిదేవిలో 2, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు లలో ఒక్కొక్కటి, మచిలీపట్నంలో 2, గన్నవరంలో ఒక పుష్కర నగర్ ఏర్పాటు చేస్తున్నారు. నదీతీరానికి దగ్గరగా, బస్సులు వచ్చేందుకు వీలుగా ఉండే చోట వీటిని నిర్మిస్తున్నారు.
విజయవాడలో ఎక్కడెక్కడా...
విజయవాడలో పున్నమిఘాట్, భవానీఘాట్, సీతమ్మవారి పాదాలు, రాజీవ్‌గాంధీ పార్క్, పాత ఆర్టీసీ బస్టాండ్, గుణదల రైల్వేస్టేషన్, మధురానగర్ రైల్వే స్టేషన్, బసవపున్నయ్య స్టేడియం, సింగ్‌నగర్, వైవీరావు ఎస్టేట్, వైవీరావు ఎస్టేట్ ఎదుట, భవానీపురం లారీస్టాండ్, దూరదర్శన్, వారధి వద్ద ఉడా పార్కు, స్క్రూ బ్రిడ్జి వద్ద, సిద్ధార్థ మెడికల్ కళాశాలలలో పుష్కరనగర్లు ఏర్పాటు చేస్తున్నారు.
పుష్కర నగర్లో కల్పించాల్సిన సౌకర్యాలు....
రాష్ట్రం నలుమూలలు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు పుష్కర నగర్లోనే కల్పించాల్సి ఉంది. రైల్వే స్టేషన్ నుంచి పుష్కరనగర్‌కు తీసుకురావడం, పుష్కరనగర్ నుంచి ఘాట్‌కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ నేప«థ్యంలో పుష్కరనగర్‌లో కొన్ని ముఖ్యమైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.
1. సమాచార కేంద్రం 2. పార్కింగ్ 3. వసతి 4. ముఖాలు కడుక్కునేందుకు గదులు 5. దుస్తులు మార్చుకునేందుకు గదులు 6. తాగునీరు 7. ఆహార పదార్థాలు అందజేసే కౌంటర్లు 8. చక్కటి లైటింగ్ 9. 24 గంటల వైద్య శిబిరం 10. అగ్నిమాపక పరికరాలు 11. బస్సులు ఆగేందుకు ప్రదేశం 12. మైక్ ప్రసార కేంద్రం, 13. ఎల్ఈడీ టీవీ, ప్రొజెక్టర్ పాయింట్లు, 14. సామగ్రి భద్రపరుచుకునే గది 15. పాదరక్షలు భద్రపరుచుకునే గది.
పనులు ఇలా...
– బస్టాండ్ వద్ద : పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్ ఎరైవల్ బ్లాక్‌లో పుష్కర నగర్‌ను నిర్మించారు. నగరంలో ఈ పుష్కరనగర్‌లో పైన షెల్టర్‌తో పాటు ఫ్లోరింగ్ పనులు పూర్తి చేశారు. తాత్కాలిక మరుగుదొడ్ల(మొబైల్ టాయిలెట్స్) తీసుకువచ్చారు. అంతకు మించి ఏమాత్రం పనులు జరగలేదు.
– రైల్వేస్టేషన్ వద్ద : రైల్వేస్టేషన్ ఎదురుగా రైల్వేస్టేడియంలోనూ, డీఆర్ఎం కార్యాలయం వెనుకవైపు పుష్కరనగర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు చోట్ల కేవలం ఐరన్ పైప్‌తో షెడ్స్ వేస్తున్నారు. కేవలం 10 శాతం పనులు మాత్రమే జరిగాయి.
– కృష్ణా, గోదావరి సంగమం : కృష్ణాగోదావరి సంగమంలో నమూనా దేవాలయాలకు పక్కనే పుష్కర నగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు నిర్మాణం పనులు జోరుగా సాగుతుండడంతో పుష్కర నగర్ ఏర్పాటుకు కొద్దిగా ఇబ్బందిగా వుంది. ప్రస్తుతానికి షెడ్లు నిర్మాణదశలోనే ఉన్నాయి. ఇంకా ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.
– భవానీపురం : భవానీపురంలో మెయిన్ రోడ్డు స్వాతి థియేటర్ సమీపంలోని పుష్కర నగర్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ షెడ్స్ పూర్తికాగా, ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. మొబైల్ టాయిలెట్స్ తీసుకువచ్చినప్పటికీ వాటికి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది.
– మధురానగర్ రైల్వేస్టేషన్ : మధురానగర్ రైల్వేస్టేషన్ నుంచి నగరానికి వచ్చేదారిలో రైల్వేస్థలంలోనే పుష్కరనగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ షెడ్స్ నిర్మాణం కొద్దిగా మాత్రమే అయ్యాయి. ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొబైల్ టాయిలెట్స్ తీసుకువచ్చారు.
– వైవీరావు ఎస్టేట్ వద్ద: వైవీరావు ఎస్టేట్ వద్ద పుష్కర నిర్మాణం ఇప్పుడే ప్రారంభం అయ్యింది. ఇంకా ఫ్లోరింగ్ నిర్మాణం కావాల్సి ఉంది. మొబైల్ టాయిలెట్స్‌తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.
– సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణ : సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణలో పుష్కరనగర్ షెడ్స్ నిర్మాణం పూర్తయింది. ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్లోరింగ్ పనులు చివర దశకు చేరాయి.
– రామలింగేశ్వర నగర్ : రామలింగేశ్వరనగర్లో పుష్కర నగర బ్యానర్లకే పరిమితం అయ్యింది. ఇక్కడ ఇంకా షెడ్స్ నిర్మాణం ప్రారంభమే కాలేదు. అధికారులు ప్రత్యేక దృష్టి పెడితే తప్ప ఇక్కడ పుష్కర నగర్ సకాలంలో పూర్తికాదు.