
కైలాష్ మానససరోవర్ యాత్రికులు (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన హిందూ భక్తులు చైనా తీరుపై మండిపడ్డారు. తమను పవిత్ర మానససరోవర్ సరస్సులో మునక వేసేందుకు చైనా అధికారులు అనుమతించడం లేదని ఆరోపించారు. చైనా అధికారులతో మాట్లాడిన అనంతరం నాథులా పాస్ మార్గం తెరిచిఉంచినట్టు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మే 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడితేనే దేశాల మధ్య సంబంధాలు పటిష్టమవుతాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖతో తాను స్పష్టం చేశానని, గత ఏడాది యాత్ర సందర్భంగా నాథులా పాస్ మార్గాన్ని మూసివేయడం ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమించింది. ప్రస్తుత యాత్రకు ఈ మార్గాన్ని తెరుస్తున్నారని ప్రకటించడం పట్ల తాను సంతోషిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
సుష్మా ప్రకటన అనంతరం తాజాగా హిందూ భక్తులు చైనా అధికారుల తీరును ప్రశ్నిస్తుండటం గమనార్హం. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా నిలిపివేసిన కైలాష్ మానససరోవర్ యాత్రను అనుమతించేందుకు చైనా అంగీకరించిందని షాంగై సహకార సంస్థ భేటీ సందర్భంగా సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ప్రతి ఏటా ఈ యాత్రను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ సెప్టెంబర్‌ల మధ్య నిర్వహిస్తుంది. లిపులేక్ పాస్ (ఉత్తరాఖండ్), నాథులా పాస్ (సిక్కిం) రూట్ల ద్వారా ఈ యాత్రను చేపడతారు. ప్రతి బ్యాచ్‌కు 24 రోజుల పాటు ఈ యాత్ర వ్యవధి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment