పైప్‌లైన్ పనులకు సన్‌స్ట్రోక్
– నత్తనడకన ఏపీఎండీపీ పైప్‌లైన్ పనులు
– రోజుకు 400 నుంచి 700 మీటర్ల పని మాత్రమే
– పనులపై దృష్టిసారించని పాలకులు, అధికారులు
అనంతపురం న్యూసిటీ : ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (ఏపీఎండీపీ)పైప్‌లైన్ పనులకు సన్‌స్ట్రోక్ తగిలింది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు పనులు చేసేందుకు ముందుకురావడం లేదు. దీంతో పైప్‌లైన్ , ట్యాంకుల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికితోడు అధికారుల కొరత పనులు జాప్యానికి మరింత ఆజ్యం పోస్తోంది. ఈ ఏడాదిలోపు 369 కిలోమీటర్ల పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ప్రస్తుతం 109 కిలోమీటర్లు మాత్రమే వేశారు. రోజుకు కనీసం ఒక కిలోమీటర్ వేస్తేనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పైప్‌లైన్ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఎమ్మెల్యే, మేయర్, అధికారులు అటువైపు తొంగి చూడటం లేదన్న విమర్శలున్నాయి.
2018లోపు పూర్తయ్యేనా..?
నగరంలో నూతన పైప్‌లైన్ ఏర్పాటైతే నీటి సమస్యకు చెక్ పెట్టడంతో పాటు శుద్ధమైన జలం ప్రజలకందించే అవకాశం ఉంటుంది. ఏపీఎండీపీ పైప్‌లైన్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టాలని నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల పైప్‌లైన్ పనుల్లో జాప్యం జరిగింది. గతేడాది మార్చి 31న పైప్‌లైన్ పనులకు అగ్రిమెంట్ జరిగ్గా, అదే ఏడాది ఏప్రిల్ 1న పనులు మొదలుపెట్టారు. 2018 లోపు పైప్‌లైన్, ట్యాంకు నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరిలోపు నగరంలో 369 కిలోమీటర్లలో పైప్‌లైన్ వేయాలి. ఇప్పటికే సిబ్బంది కొరతతో పైప్‌లైన్ పనులు జాప్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. గత నెల రోజులుగా పైప్‌లైన్ పనులు పెద్దగా జరగలేదు. రోజూ అధిక సంఖ్యలో వచ్చే కూలీలు ఇప్పుడు ముందుకురావడం లేదు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ ఏడాదిలోపు పైప్‌లైన్ వేస్తారో లేదో వేచి చూడాలి.
సిబ్బంది కొరత
పైప్‌లైన్ పనులు మొదలైనప్పటి నుంచి ఏపీఎండీపీ పైప్‌లైన్ పనులకు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒక ఈఈ, ముగ్గురు డీఈలు, ఇద్దరు ఏఈలు ఉండాల్సి ఉండగా కేవలం ఈఈ, ఏఈ మాత్రమే ఉన్నారు. దీన్నిబట్టే క్షేత్రస్థాయిలో పనులను ఏవిధంగా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సదరు ఐహెచ్పీ కంపెనీ కొన్ని జోన్లలో జరిగే పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. అన్ని ప్రాంతాల్లో పనులను పరిశీలించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఏపీఎండీపీ పనులను పాలకులు, అధికారులు తేలిగ్గా తీసుకోవడం పెద్ద దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏనాడు పైప్‌లైన్ పనుల గురించి ప్రస్తావించిన పాపాన పోలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా పాలకులు మేలుకుని పైప్‌లైన్ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ ఏడాదిలోపు పూర్తి చేస్తాం
- రామ్మోహన్ రెడ్డి(ఏపీఎండీపీ ఈఈ)
అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏడాదిలోపు పైప్‌లైన్, ఆరు ట్యాంకుల నిర్మాణాలను పూర్తిచేస్తాం. పూర్తీగా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టేందుకు 2018 వరకు గడువు ఉంది. గడువులోపు తప్పక పనులను పూర్తిచేస్తాం.