వివేకం: తప్పు ఒప్పుకోవడం అవమానమా?
చిన్నతనంలో మీరెంతో సర్దుకుపోయేవారు. ఏ బాధా లేకుండా తప్పు ఒప్పుకునేవారు. జీవితంలో అప్పుడెలాంటి సంతోషం ఉండేది? అదే ఇప్పుడెందుకు కరువయ్యింది? శారీరకంగాను, మానసికంగాను మీరు పెరిగేకొద్దీ గట్టిపడిపోయారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఆ గుర్తింపునకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, మీ నిజాయితీని బలిపెట్టదలచుకున్నారు. అందుకే తప్పులను ఒప్పుకునే తత్వాన్ని పోగొట్టుకున్నారు. మనిషిగా పుట్టినవారెవరూ తప్పులకు అతీతులు కారు. చేసింది తప్పా, ఒప్పా అనేది కాదు సమస్య. దాన్ని అంగీకరించడంలో ‘అవమానం’ అనే అహంకారపు భావనే సమస్య. ‘క్షమించు, తెలియక జరిగింది! ఈసారి ముందే తెలియజేయి, దిద్దుకుంటాను’ అని వినయంగా చెప్పుకుంటే ఏమి పోతుంది? తప్పు తెలుసుకున్న తర్వాత కూడా, నలుగురిలో ఒప్పుకునే ధైర్యం లేక, దాన్ని సమర్థించుకుంటూ పోవడం పెద్ద తప్పు. ఒకసారి శంకరన్ పిళ్లైకి పక్క తోటలో వేలాడుతున్న ‘పండిన పండ్లు’ కనిపించాయి. గోనె సంచీ తీసుకొని, కంచె దాటి వెళ్లాడు. పండ్లను కోసి, సంచీ నింపి, భుజమ్మీద వేసుకుని కంచె దాటుతూ ఎదురుగా వచ్చిన తోటమాలికి దొరికిపోయాడు.
‘‘ఎవరినడిగి ఇవన్నీ కోశావు?’’
‘‘నేనేం కోయలేదు. పెద్ద గాలికి అన్నీ రాలిపడ్డాయి’’ అన్నాడు శంకరన్ పిళ్లై.
‘‘అయితే మరి గోనెసంచీనెందుకు తెచ్చావు?’’
‘‘ఓ! ఇదా! ఇదీ గాల్లోనే ఎగిరి వచ్చింది!’’
‘‘గాలికి పండ్లు రాలాయి! సంచీ ఎగిరి వచ్చింది! కాని, పండ్లు సంచీలో నింపిందెవరు?’’ అని తోటమాలి అడిగాడు.
శంకరన్ పిళ్లై బెదరకుండా, అమాయకుడిలా మొహం పెట్టి ‘‘అదే నాకూ ఆశ్చర్యంగా ఉంది’’ అన్నాడు. చాలామంది తప్పుచేసేవారు శంకరన్ పిళ్లైలా పట్టుబడ్డా ఒప్పుకోకుండా, అది తప్పు కాదంటూ దాటవేస్తారు. తప్పు ఒప్పుకోకుండా, ఇలా మొండికేయడం ప్రమాదకరమే! స్నేహితులు, సహోద్యోగులు, పై అధికారులు, మీ కింద పనిచేసే ఉద్యోగులు, అపరిచితులు... ఇలా ఎవరిదగ్గరైనా బేధభావం చూపకుండా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ధైర్యం చేసి దాన్ని ఒప్పుకోండి. అది మీ గౌరవాన్ని పెంచుతుంది.
అనాలోచితంగా ఒకసారి తప్పు చేయవచ్చు. కాని గ్రహింపు లేకుండా, అదే తప్పును తిరిగి చేయడం అభివృద్ధికి ఆటంకం. కొందరు మీ తప్పును భూతద్దంలోంచి చూడవచ్చు. చూడనీయండి. క్షమింపమని అడిగితే, అక్కడితో యుద్ధం ముగుస్తుంది కదా, తరువాత తప్పులెంచినవారే తామే తప్పు చేసినట్లు భావిస్తారు.
గుర్తుంచుకోండి, మీ మనసు పక్వం చెందినదనటానికి ఇది ఒక గుర్తు.
వ్యాపారంలోనైనా, ఆటల్లోనైనా, యింట్లోనైనా, తప్పులను ఒప్పుకోవడంలోనే గెలుపు ఉంటుంది. తప్పు అంగీకరించడం శత్రువులను కూడా స్నేహితులుగా మార్చగలదు. అది ఓటమి లేని బలం. జీవితంలో ఉన్నతికి తీసుకెళ్లగలిగే బలం.
సమస్య - పరిష్కారం
బాగా బతకడానికి చేసే పనిలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ప్రయత్నించి పైకి రావాలి గానీ, ఈ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడం సమయం వృధా చేయడమే కదా?
-పి.జీవన్‌కుమార్, కాకినాడ
సద్గురు: ఆత్మజ్ఞానమంటే మీ గురించి మీరు తెలుసుకోవడమే. మీకో సెల్ఫోనుందా? మీరు కెమెరాను వాడుతారా? దాని గురించి మీరెంత ఎక్కువగా తెలుసుకుంటే అంత బాగా దానిని ఉపయోగించుకోగలుగుతారు. మీరు వాడే వస్తువు విషయంలో ఇది నిజమైనప్పుడు, మీ విషయంలో ఇది నిజమెందుకు కాకూడదు? ఈ మానవ పరికరాన్ని (ఈ శరీరం, మనసుల) గురించి మీరెంత ఎక్కువగా తెలుసుకుంటే, మీరు అంత బాగా దానితో వ్యవహరించగలుగుతారు. ఆత్మజ్ఞానమనేది హిమాలయ గుహలలో సంభవించేదని అనుకోకండి.
జీవన ప్రక్రియ గురించి ఏమాత్రం తెలుసుకోకుండానే ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలో అవి మనుషులు నేర్చుకోవాలనుకుంటున్నారు. స్పష్టత లేని ఆత్మవిశ్వాసం ఓ పెను విపత్తు. మీ కళ్లకు గంతలు కట్టి మిమ్మల్ని అలా నడవమని చెప్పామనుకుందాం. మీకు వివేకముంటే, మీరు మీ దారిని గ్రహిస్తారు. అటు ఇటు మెల్లగా మెల్లగా అడుగులు వేస్తూ, గోడల్ని పట్టుకుంటూ, మీ చేతులతో, కాళ్లతో స్పృశిస్తూ నడుస్తారు. అయితే మీరు మితిమీరిన విశ్వాసంతో ఏది పట్టించుకోకుండా నడిస్తే, ప్రపంచం మీ పట్ల అంత దయ చూపించదు. స్పష్టత లేని విశ్వాసంతో ఉంటే జీవితమూ మీ పట్ల అంత దయ చూపించదు. మీరు ఎందులో ఉన్నా అందులో విజయం సాధించడానికి, మీకు కావల్సింది స్పష్టత! విశ్వాసం కాదు. ఏ విషయంలోనైనా స్పష్టత తీసుకువచ్చేదే ఆత్మజ్ఞానం.
- జగ్గీ వాసుదేవ్