పీజేఆర్‌కు ఘన నివాళి
బంజారాహిల్స్: మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్‌రెడ్డి(పీజేఆర్) వర్ధంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖైరతాబాద్ కూడలిలోని పీజేఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీజేఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి పద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకురాలు పి.విజయారెడ్డి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ అగ్రనేతలు పలువురు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీ.పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే విష్ణు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పీజేఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పొన్నాల తదితరులు మాట్లాడుతూ పీజేఆర్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పీజేఆర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన
ఎంపీ కవిత
బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్ గ్రౌండ్లో ఆదివారం పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీజేఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు పి.విజయారెడ్డి కూడా పాల్గొన్నారు. పీజేఆర్ తెలంగాణ కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా కవిత కొనియాడారు. కాంగ్రెస్‌లో ఉంటూనే తెలంగాణకోసం పోరాడిన గొప్పయోధుడు పీజేఆర్ అని ఆమె అన్నారు.