plane hijacked
-
విమానం కిటికిలోంచి పైలట్ దూకేశాడు!
ఈజిప్టు విమానం హైజాక్ వ్యవహారం ప్రయాణికులను కాసేపు ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రాణాలు అరచేత పట్టుకొని బందీలుగా వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంతటి హైడ్రామా నడుమ బందీగా చిక్కిన ఓ ప్రయాణికుడు ఏకంగా హైజాకర్తోనే సెల్ఫీ దిగాడు. ఆత్మాహుతి జాకెట్ తో ఉన్న హైజాకర్‌తో అతను ఫొటో దిగడం విస్మయం కలిగిస్తోంది. ఇక ఆత్మాహుతి జాకెట్ ధరించిన సీఫ్ ఎల్ దిన్ ముస్తాఫా అనే వ్యక్తి... ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసి.. సైప్రస్‌లోని లార్నాకలో బలవంతంగా దిపించిన సంగతి తెలిసిందే. అధికారులతో చర్చల అనంతరం తన అధీనంలో బందీలుగా ఏడుగురిని అతను విడిచిపెట్టాడు. ఆ వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేయడంతో ఈ హైజాక్ డ్రామా సుఖాంతమైంది. అయితే ఈ వ్యవహారంలో ఉత్కంఠభరితమైన ఉద్వేగభరితమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. లార్నాకలో విమానం ల్యాండైన తర్వాత ఓ పైలట్ హైజాకర్ నుంచి తప్పించుకోవడానికి చిన్నపాటి సాహసమే చేశాడు. విమానం ల్యాండైన తర్వాత అతడు కాక్‌పిట్ కిటికి నుంచి చాకచక్యంగా దూకి తప్పించుకున్నాడు. అయితే వెంటనే అధికారుల రంగ ప్రవేశంతో ఈ హైజాక్ డ్రామా కూడా ముగిసింది. 62 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని హైజాక్ చేసిన సీఫ్.. అందులోని మహిళలు, పిల్లలను సురక్షితంగా దింపేసిన అనంతరం ఓ మహిళ సిబ్బంది ద్వారా నాలుగు పేజీల లేఖను విమానాశ్రయ అధికారులకు పంపించాడు. సైప్రస్‌లో తన మాజీ భార్యను చూసేందుకు, ఆమెతో మాట్లాడేందుకు సీఫ్ ఇంతటి దుండగానికి పాల్పడినట్టు తెలుస్తోంది. -
వాడు టెర్రరిస్టు కాదు.. వట్టి ఇడియట్!
ఈజిప్టు విమానం హైజాక్ వ్యవహారంలో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ విమానాన్ని హైజాక్ చేశారని వార్తలు రావడం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత, ఆందోళన వ్యక్తమైంది. తీరా ఆరా తీస్తే.. సీఫ్ ఎల్డిన్ ముస్తాఫా అనే ఈజిప్టు వ్యక్తి ఈ విమానాన్ని హైజాక్ చేసినట్టు తేలింది. తన మాజీ భార్యను చూసేందుకే ఈ ఘనుడు ఇంతటి డ్రామాకు తెరతీశాడు. ఆత్మాహుతి జాకెట్ ధరించిన అతడు విమాన సిబ్బందిని బెదిరించి.. సైప్రస్‌లోని లార్నాకలో బలవంతంగా ప్రైవేటు జెట్ విమానాన్ని దింపించాడు. ప్రస్తుతం అతని అధీనంలో 11 మంది బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు బ్రిటన్ పౌరులు, ఒక ఇటాలియన్, ఒక ఐరీష్ వ్యక్తి ఉన్నట్టు సమాచారం. హైజాకర్ సీఫ్ డిమాండ్ మేరకు అతని మాజీ భార్యను సీన్లోకి రప్పించారు అధికారులు. మరోవైపు ఈజిప్టు విమానం హైజాక్ వ్యవహారంపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అగ్గిమీద గుగ్గిలంలా మారింది. హైజాక్ చేసిన వ్యక్తి ఉగ్రవాది కాదని, అతడు వట్టి మూర్ఖుడని (ఇడియట్), ఉగ్రవాదులు వెర్రిగా వ్యవహారిస్తారని, కానీ పిచ్చిపనులు చేయరని, కానీ వీడు చేశాడని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 62 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని ఆత్మాహుతి జాకెట్‌తో బెదిరించి సీఫ్ హైజాక్ చేశాడు. అందులోని మహిళలు, పిల్లలను సురక్షితంగా దింపేసిన అనంతరం ఓ మహిళ సిబ్బంది ద్వారా నాలుగు పేజీల లేఖను విమానాశ్రయ అధికారులకు పంపించాడు. సైప్రస్‌లో తన మాజీ భార్యను చూసేందుకు, ఆమెతో మాట్లాడేందుకు సీఫ్ ఇంతటి దుండగానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అతడి అధీనంలో ఉన్న బందీలు విడిపించి.. ఈ హైజాక్ డ్రామాకు తెరదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
ఈజిప్టు విమానం హైజాక్
ఈజిప్టుకు చెందిన ఓ విమానం హైజాక్ అయింది. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ విమానాన్ని సైప్రస్‌లోని లార్నాక విమానాశ్రయంలో విమానాన్ని బలవంతంగా దించారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో హైజాకర్లు కంట్రోల్ టవర్‌ను సంప్రదించారు. అరగంట తర్వాత విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, సుమారు 3 గంటల తర్వాత.. ప్రయాణికులలో ఉన్న నలుగురు విదేశీయులు, విమాన సిబ్బంది మినహా మొత్తం అందరినీ ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు ఈజిప్ట్ ఎయిర్ సంస్థ తెలిపింది. ఈ నలుగురు బ్రిటిషర్లు, అమెరికన్లని తెలుస్తోంది. దీంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థే ఈ హైజాకింగ్‌కు పాల్పడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లార్నాక విమానాశ్రయం లెబనాన్‌కు సమీపంలో ఉంటుంది. తమ విమానం ఎంఎస్181 హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్టు అధికారులు ధ్రువీకరించారు. హైజాకర్లు ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్లు బయటపెట్టలేదు. విమానాశ్రయంలో క్రైసిస్ టీమ్‌ను మోహరించారు. విమానంలో ఉన్న ఉగ్రవాదుల్లో కనీసం ఒకరి వద్ద ఆయుధాలు ఉన్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ చెబుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు తెలుస్తోంది. సిరియాలో ఇటీవల పెద్ద ఎత్తున ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు చేస్తోంది. దానికి ప్రతీకారంగానే విమానాన్ని హైజాక్ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది . హైజాక్ విషయమై వివరాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఒకరు తాను కట్టుకున్న బాంబుల బెల్టును పేల్చేస్తానంటూ పైలట్‌ను బెదిరించినట్లు తెలిసింది. కానీ మరోవైపు విమానంలో ఉన్న మహిళలు, పిల్లలను మాత్రం బయటకు పంపేసేందుకు ఉగ్రవాదులు అంగీకరించారు. తర్వాత నలుగురు విదేశీయులు మినహా అందరినీ విడిచిపెట్టారు. హైజాక్ చేసిన వాళ్లలో ఒకరిని ఈజిప్టుకే చెందిన ఇబ్రహీం సమాహా అని ఈజిప్షియన్ మీడియా గుర్తించింది. కాగా, హైజాకర్లు తమకు సైప్రస్‌లో ఆశ్రయం కావాలని డిమాండ్ చేశారని స్టేట్ రేడియో తెలిపింది. -
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్!
అడిస్ అబాబా నుంచి రోమ్ నగరానికి బయలుదేరిన ఇథియోఫియన్ ఎయిర్ లైన్స్ విమానం సోమవారం ఉదయం హైజాక్ అయింది. హైజాక్ అయిన ఆ విమానాన్ని జెనీవా ఎయిర్ పోర్ట్ లో దింపాలని హైజాకర్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇథియోఫియన్ ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. 702 ప్రయాణికులతో అడిస్ అబాబా నుంచి బయలుదేరిన విమానం రోమ్ వెళ్లవలసి ఉంది. అయితే మార్గ మధ్యంలో విమానాన్ని హైజాకర్లు హైజాక్ చేశారని ఇథియోఫియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఆ ఘటనపై మరింత సమాచారం అందించవలసి ఉందని తెలిపింది.