ఫేస్బుక్ ఏం చేసిందంటే..
కాలిఫోర్నియా: సోషల్ నెట్ వర్కింగ్ సైట్ దిగ్గజం ఫేస్బుక్ చేసిన పొరపాటును సరిదిద్దుకుంది. ఒక ప్లస్-సైజు మోడల్ ఇమేజ్ ను తిరస్కరించి తప్పు చేశామంటూ క్షమాపణలు చెప్పింది. సదరు యాడ్ ను పరిశీలించే క్రమంలో తమ ఉద్యోగుల బృందం తప్పుగా అర్థం చేసుకుందని , దీనికి చింతిస్తున్నామని వివరణ ఇచ్చింది.
శరీర సానుకూలతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమంలో న్యూయార్క్‌కి చెందిన సంస్థ టెస్ హాలీడే ఓ యాడ్ లో కనిపిస్తుంది. ఇది అవాంఛనీయ పద్ధతిలో, శరీర భాగాలు వర్ణిస్తుందంటూ ఫేస్ బుక్అభ్యంతరం తెలిపింది.. బికినీ ధరించిన ఈ ప్లస్ సైజ్ మోడల్ యాడ్ ఇమేజ్‌ని పెట్టేందుకు మొదట అనుమతి నిరాకరించింది. తమ సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంది. దీనిపై ఆస్ట్రేలియన్ స్త్రీవాదులు ఓ టీవీ టాక్ షో లో మండిపడ్డారు. ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన ఫేస్బుక్ స్పందించింది. ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా లేదని స్పష్టం చేసింది. మళ్లీ పునరాలోచించి ఆ యాడ్‌కి ఓకే చెబుతున్నట్టు ప్రకటించింది.
తమ ఉద్యోగుల బృందం వారానికి లక్షల సంఖ్యలో యాడ్ ఇమేజ్‌లను పరిశీలించి వాటిని అనుమతిస్తారని పేర్కొంది. ఈ క్రమంలో వారు తప్పుగా అర్థం చేసుకున్నారని , అందుకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంది. ఆ యాడ్ ఇమేజ్ తమ యాడ్ పాలసీలకు అనుగుణంగానే ఉందని గ్రహించిన తర్వాత దాన్ని ఫేస్బుక్లో పెట్టేందుకు అనుమతిచ్చామని పేర్కొంది.