అవినీతిపై ప్రశ్నిస్తే స్పందించరేం?
సీతంపేట: సీతంపేట పీఎంఆర్సీలో జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కలమ ట వెంకటరమణ, అధికార పక్ష ఎమ్మెల్యే శివాజీలు అవినీతిపై అధికారులను నిలదీశారు. ఐటీడీఏలో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, విచారణలో లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై రెండేళ్లుగా ప్రశ్నిస్తే అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏమిటని మండిపడ్డారు. సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. ఉద్యానవనశాఖ లో రైతులకు ఎరువులు, పురుగు మందులు సక్రమంగా అందలేదని, దీనిలో రూ. 2.80 కోట్లు అవినీతి జరిగిందని, ఎరువులు పక్కదారి పట్టాయని పాలకొండ ఎమ్మెల్యే కళావతి సంబంధిత అధికారులను నిలదీశారు. ఎరువులను పూర్తిగా పంపిణీ చేసేస్తే గోదాంలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.
కాలం చెల్లే వరకూ ఎరువులనుహెచ్ఎన్టీసీ ఫారంలో ఎందుటు ఉంచాల్సి వచ్చిందని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నిలదీశారు. దీనికి ఐటీడీఏ పీవో జె.వెంకటరావు బదులిస్తూ.. 2014లో సంభవించిన హుద్‌హుద్ తుపాను సమయంలో రైతులకు పంపిణీ చేయాల్సిన ఎరువులు ఉండిపోయాయని బదులిచ్చారు. అక్రమాలు ఉన్నాయనే ఆలోచించి గత పీవో సత్యనారాయణ ఎరువులు పంపిణీ చేసిన వారికి డబ్బులు చెల్లించలేదని వివరించారు. దీనికి ఎమ్మెల్యే కలమట స్పందిస్తూ.. పీవోగా వెంకటరావు చేరిన కొద్ది రోజులకే రూ.90 లక్షలు చెల్లించాల్సిన అవసరమేమిటని నిలదీశారు. ఎరువుల అవినీతిపై పూర్తి విచారణ ఎప్పటికి జరుగుతుందనేది నివేదిక ఇవ్వాలని పలాస ఎమ్మెల్యే శివాజీ కోరారు. విజిలెన్స్ ఎస్పీకి విచారణ బాధ్యత అప్పగించామని కలెక్టర్ లక్ష్మీనరసింహం చెప్పారు.
‘వెలుగు’లో అవినీతి పెచ్చుమీరింది
వెలుగు పథకంలో అవినీతి పెచ్చుమీరిందనిఎమ్మెల్యే కళావతి ఆరోపించారు. గతంలో బాలబడులు, న్యూట్రీషియన్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో జరిగిన పాలకవర్గ సమావేశాల్లో నిలదీసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవన్నారు. అక్రమాలు చేసిన వారికి ఏకంగా ఉద్యోగాలు తిరిగి ఇతర జిల్లాల్లో ఇచ్చేశారన్నారు. భామిని ఎంఎంఎస్‌లో 2012 నుంచి 15 వరకు ఆడిట్ ఎందుకు జరగలేదని ఎమ్మెల్యే కలమట ఏపీడీ సావిత్రిని నిలదీశారు. ఎంఎంఎస్ నిధులు సీఎఫ్ రూ.90 వేలు సొంతానికి వాడుకున్నాడని ఇది ప్రశ్నించిన నాపై దాడికి దిగాడని కొత్తూరు ఎంపీపీ రాజేశ్వరి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.ఆయనపై చర్యలు తీసుకోవాలని కలమట పట్టుబట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. మందస ఎంఎంఎస్‌లో ఎటువంటి వోచర్లు లేకుండా లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని, సక్రమంగా విచారణ జరగలేదని గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠల్, ఎమ్మెల్యే శివాజీలు ఆరోపించారు. ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి అక్రమాలు చేసిన నిధులను రాబట్టాలని ఎమ్మెల్సీ ప్రతిభా భారతి కోరారు.
మమ్మల్ని అనాగిరికులను చేయొద్దు
అణగారిన గిరిజనులను ఇంకా అనాగిరికులను చేయవద్దని, మా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇక్కడ అధికారులుగా వచ్చారా అని ఎమ్మెల్యే కళావతి పీఏవో జగన్మోహన్పై ఆగ్రహించారు. ప్రోటోకాల్ ఉల్లంఘణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ పీవోను కోరారు. పాలకొండ మండలం డోలమడ పంచాయితీలో రహదారి పూర్తి చేయకుండా బిల్లులు మార్చేశారని జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదర్ ప్రశ్నించగా.. విచారణ జరుగుతోందని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఎప్పుడు విచారణ పూర్తవుతుందని సభ్యులు ప్రశ్నించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులతో కమిటీ వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అంబావల్లి గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభం కాకపోవడంతో గిరిజనులు ఖాళీగా ఉన్నారని ఎమ్మెల్యే కలమట సమావేశం దృష్టికి తెచ్చారు. ఇందిర జలప్రభ పథకం బోర్లకు విద్యుత్ కనెక్షన్ వేయలేదని జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సవరతోట ముఖలింగం అన్నారు.
ప్రోటోకాల్ ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?
ఐటీడీఏ అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్యే కళావతి మండిపడ్డారు. ఇటీవల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు సీతంపేటలో ప్రారంభిస్తే తమ పేరును చిన్నదిగా పెట్టారని, గొయిది పంచాయతీలో కార్యక్రమం జరిగితే ఆ సర్పంచ్‌కే చెప్పలేదని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో ఎందుకు కో ఆర్డినేషన్ చేసుకోవడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లఘించిన అధికారులకు చార్జ్‌మెమో ఇస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు. లాడా, పాండ్ర గ్రామాలకు జీసీసీ ద్వారా రేషన్ అందడం లేదని, ఐదు వందల కుటుంబాలు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న వేరే గ్రామానికి వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే కళావతి సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఉపాధి, మరుగుదొడ్ల నిర్మాణ బిలులు రావడం లేని బూర్జ జెడ్మీటీసీ సభ్యుడు రామకృష్ణ అన్నారు.
డీఈ సస్పెన్సన్:నీటి ఎద్దడి ప్రణాళికలు వేయమంటే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినందుకు సంబంధిత డీఈ మల్లికార్జున్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా రూ.5.6 కోట్లు మంజూరు చేస్తే సీతంపేట మండలంలోని దారపాడు పంచాయతీకి కోటి రూపాయలతో ప్రతిపాదన ఎందుకు పెట్టారని ఎమ్మెల్యేలు వెంకటరమణ, కళావతిలు ప్రశ్నించారు. దీనికి సంబంధిత అధికారులు సరిగా సమాధానం చెప్పకపోవడంతో డీఈ సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశించారు. నీటి ఎద్దడి ప్రణాళికలు క్షేత్రస్థాయిలో తయారు చేయాలని ఎస్ఈ రవీంద్రనాథ్‌కు ఆదేశించారు. ఏనుగుల సమస్యను పరిష్కరించాలని, ఐదోషెడ్యూల్డ్ సాధనకు తీర్మానం చేయాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. అందరి సభ్యుల ఆమోదించడంతో తీర్మానం చేశారు. ఇకపై ప్రతీ రెండు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శివాజీ కోరారు. మూడు నెలలకొకసారి జరగాల్సిన సమావేశం ఆరునెలలకెందుకు పెట్టారని ప్రశ్నించారు. ఇకపై రెండు నెలలకు సమావేశం పెడతామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, ఇచ్ఛాపురం, నరసన్నపేట ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఆర్డీవోలు గున్నయ్య, దయానిధి పాల్గొన్నారు.
20 శాఖల ఊసే లేదు!
ఐటీడీఏ సమావేశంలో 20 శాఖల పనితీరుపై చర్చే జరగలేదు. ప్రతి సమావేశంలోనూ ఇదే పరిస్థితి. గత సమావేశం మూడు గంటల్లో ముగియగా, ఈసారి మరో గంట ఎక్కువ జరిగినా ఫలితం లేకపోయింది. కీలకశాఖలపై చర్చ జరగకపోవడంతో కొంతమంది ప్రజాప్రతినిధులు అసంతృప్తి చెందారు. ఎంపీ కొత్త పల్లి గీత సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆమె గత సమావేశానికి కూడా రాకపోవడం గమనార్హం. గత సమావేశంలో ప్రస్తావనకు రాని శాఖలపైనే ఇప్పుడు చర్చించి, మిగతా శాఖలను వదిలేశారు. ముఖ్యమైన ఇంజినీరింగ్‌శాఖ, ఎస్ఎంఐ, గృహనిర్మాణశాఖ, ట్రైకార్, ఏపీఈపీడీసీఎల్, మహిళా, శిశుసంక్షేమశాఖ, అటవీశాఖ, పట్టుపరిశ్రమ, ఏపీఎస్ఐడీసీ, ప్రాథమిక విద్య, గిరిజన సంక్షేమ విద్య, మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ, మత్స్య శాఖ వంటి శాఖల ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. నలుగురు ఎమ్మెల్సీలు హాజరు కావాల్సి ఉండగా.. ప్రతిభాభారతి మాత్రమే పాల్గొన్నారు.భారీ బందోబస్తు: పాలకవర్గ సమావేశం సందర్భంగా గట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్సీప సీహెచ్ ఆదినారాయణ, సీఐ అశోక్‌కుమార్, ఎసై్స వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.