గమ్యం చేరని నిఘానేత్రం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ–సీ61 ప్రయోగం లక్ష్యాన్ని సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. నిఘా అవసరాలకు ఉద్దేశించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో రాకెట్ విఫలమైంది. ప్రయోగంలో తొలి రెండు దశలు విజయవంతమైనా మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇస్రో అమ్ముల పొదిలో కీలక అస్త్రంగా భావించే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్) విఫలం కావడం అత్యంత అరుదు. ఇస్రో చరిత్రలో శ్రీహరికోట నుంచి జరిగిన ఈ 101 ప్రయోగం అనుకున్న ఫలితం ఇవ్వకపోవడం శాస్త్రవేత్తలను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ వైఫల్యం నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలు వాయిదా పడే అవకాశాలున్నాయి. 2018–2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 74 శాతం రాకెట్ ప్రయోగాల వైఫల్యానికి ప్రొపల్షన్, స్టేజ్–సపరేషన్ అంశాలే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. గతి తప్పిన రాకెట్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్–షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 110 సెకండ్ల వ్యవధిలో తొలి దశలో 70 కిలోమీటర్లు ఎత్తుకు, 261.8 సెకండ్లలో రెండో దశలో 232 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. 262.9 సెకండ్లకు మూడో దశలో ఘన ఇంధన మోటార్ మండించే సమయంలో రాకెట్ గతి తప్పింది. సరిచేసేందుకు మిషన్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. రాకెట్ సముద్రంలో పడిపోయి ఉంటుందని ఇస్రో రిటైర్డ్ అధికారి ఒకరు చెప్పారు. ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారు. మోటార్ కేస్‌లోని చాంబర్ ప్రెషర్లో లోపం తలెత్తినట్లు వెల్లడించారు.విచారణకు కమిటీ పీఎస్ఎల్వీ–సీ61 వైఫల్యానికి కారణాలు తెలిస్తేనే భావి ప్రయోగాల విషయంలో మరిన్ని జాగ్రత్తలకు ఆస్కారముంటుంది. అందుకే ఇస్రో నిపుణులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మిషన్ స్పెషలిస్టులతో తొలుత ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ(ఎఫ్ఏసీ)ని వేయనున్నారు. ప్రయోగ డేటాను ఇది క్షుణ్నంగా సమీక్షించి వైఫల్యానికి కారణాలను తేలుస్తుంది. కారణం సాంకేతికమా, మానవ తప్పిదమా, ప్రతికూల వాతావరణం వంటి బాహ్య అంశాలా అనేది నిర్ధారిస్తుంది. అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.కారణం అదేనా? పీఎస్ఎల్వీ–సీ 61 వైఫల్యానికి కారణంపై ఇస్రో దృష్టి సారించింది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే రాకెట్ కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాజిల్‌ను సరిచేసి ఇంధనాన్ని మండించడంలో ఈ వ్యవస్థదే కీలక పాత్ర. దీన్ని పొరలతో కూడిన ఎలాస్టోమెరిక్ మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. ప్రయోగం మూడో దశలో హైడ్రాక్సిల్–టెరి్మనేటెడ్ పాలీబ్యుటాడీన్ (హెచ్టీపీబీ) ఇంధనాన్ని ఉపయోగించారు. ఇది 240 కిలోన్యూటన్ థ్రస్ట్‌ను ఉత్పన్నం చేయగలదు.ఇస్రో గెలుపుగుర్రం పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌక ఇస్రోకు అత్యంత నమ్మకమైనది. ఎర్త్ అబ్జర్వేషన్, జియో–స్టేషనరీ, నావిగేషన్ అనే మూడు రకాల పేలోడ్లను నింగిలోకి పంపేలా పీఎస్ఎల్వీని ఇస్రో అభివృద్ధి చేసింది. దీని ఎత్తు 44.5 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు. ఒకేసారి 1,750 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. భూమి నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్‌కు చేరుకోగలదు. ఈ వాహక నౌక ఇస్రోకు ఎన్నో విజయాలు అందించి గెలుపు గుర్రంగా గుర్తింపు పొందింది. 2008లో చంద్రయాన్–1, 2013లో మార్స్ ఆర్బిటార్ స్పేస్‌క్రాఫ్ట్, 2023లో ఆదిత్య ఎల్1 మిషన్లను పీఎస్ఎల్వీ ద్వారానే ప్రయోగించారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో ఇప్పటిదాకా చేపట్టిన 63 ప్రయోగాల్లో ఇది కేవలం మూడో వైఫల్యం. 1993 సెపె్టంబర్లో పీఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఐఆర్ఎస్–1ఈ ఉపగ్రహాన్ని, 2017 ఆగస్టులో పీఎస్ఎల్వీ–సీ39 రాకెట్ ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయాయి.