ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రీయ ఉత్పత్తుల నాణ్యత పెంచి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ఐదేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణకు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడకుండా, రైతులకు వ్యయప్రయాసలను తొలగిస్తూ ఇకపై రాష్ట్రంలోనే ధ్రువీకరణ సర్టిఫికెట్ పొందొచ్చు. ఈ సర్టిఫికెట్ జారీకి సేంద్రీయ ధ్రువీకరణకు వ్యవసాయం, ఆహారశుద్ధి ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి అనుమతినిచి్చంది. ఫలితంగా సేంద్రీయ పంట ఉత్పత్తులకు రైతులు గిట్టుబాటు ధర పొందడంతో పాటు ఆ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. సర్టిఫికేషన్ ఉంటే ’ఏపీ’కి తిరుగేలేదు ఏపెడా లెక్కల ప్రకారం సేంద్రీయ సాగులో మన దేశం 8వ స్థానంలో, ఉత్పత్తిదారుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. దేశంలో 1.07 కోట్ల ఎకరాల్లో సేంద్రీయ పంటలు సాగవుతున్నాయి. వాటిలో 65.73 లక్షల ఎకరాలు వాస్తవ సాగు ప్రాంతం కాగా, 41.51 లక్షల ఎకరాలు అటవీ ప్రాంతం. ధ్రువీకరించిన సేంద్రీయ ఆహార ఉత్పత్తులు 3.50 మిలియన్ మెట్రిక్ టన్నులు. వాటిలో రూ.7078 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఇండియన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో విదేశాలకు ఎగుమతవుతున్నాయి.పలు రకాల ఆహార, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తుల దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే రాష్ట్రంలోని ఉత్పత్తులకు సర్టిఫికేషన్ లేకపోవడం ఎగుమతులకు ప్రధాన సమస్యగా మారింది. దీంతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆక్వా ఉత్పత్తులు, ఉద్యాన పంటలకు క్రాప్ సర్టిఫికేషన్ చేసుకునే రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. మూడేళ్లలోనే ఏపీకి గుర్తింపు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 8.50 లక్షల ఎకరాలు సాగవుతున్నప్పటికీ, ఎపెడా లెక్కల ప్రకారం పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో సాగయ్యే విస్తీర్ణం 60 వేల ఎకరాలే. దిగుబడులు 20వేల టన్నులు వస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఇంటర్ననేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ నిర్వహించిన సర్వేలో సర్టిఫికేషన్‌పై ఏపీ నుంచి ఏటా కేవలం రూ.130 కోట్ల ఎగుమతులే జరుగుతున్నాయి. నిర్దిష్టమైన పాలసీ, సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంటే రూ.2 వేల కోట్లకు పైగా జరుగుతుందని అంచనా వేసింది. జాతీయ సేంద్రీయ ఉత్పత్తుల కార్యక్రమం (ఎన్పీఓపీ) కింద దేశంలో 37 సేంద్రీయ ధ్రువీకరణ సంస్థలున్నాయి. వాటిలో ఏపీ, తెలంగాణాతో పాటు 14 రాష్ట్ర ప్రభుత్వ, 23 ప్రైవేటు ఏజెన్సీలకు గుర్తింపు ఉంది. మూడేళ్లలోనే ఏపీకి ఈ గుర్తింపు లభించింది. ప్రత్యేకంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ విభాగం సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సేంద్రీయ విధానాన్ని తీసుకొచ్చారు. ఎన్పీఓపీ నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసి ధ్రువీకరించేందుకు ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఎస్సీఏ)కి అనుబంధంగా 2021–22లో ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓసీఏ)ని ఏర్పాటు చేశారు. క్వాలిటీ మేనేజర్ పర్యవేక్షణలో జోన్‌కి ఒకరు చొప్పున ఇద్దరు ఎవాల్యుయేటర్స్, జోన్‌కి ఇద్దరు చొప్పున నలుగురు ఇన్స్పెక్టర్స్/ఆడిటర్స్‌ను నియమించారు.ఈ విభాగం ద్వారా తొలి దశలో పొలం బడులు, తోటబడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రీయ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకలి్పంచారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటికీ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ జారీకి లైసెన్సు జారీ చేసింది. పొలం బడులు, తోట బడులు ప్రామాణికంగా 2023 ఖరీఫ్ సీజన్ నుంచి గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సర్టిఫికెట్తో రైతులు మద్దతు ధరకంటే 2, 3 రెట్ల ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతున్నారు.ధ్రువీకరణ ఇలా..⇒ సీజన్‌వారీగా ఇప్పటికే సాగయ్యే వ్యవసాయ, ఉద్యాన పంటలు (ఫీల్డ్ క్రాప్స్)కు 2 ఏళ్లు, పండ్ల తోటలకు మూడేళ్ల పాటు సాగు పద్ధతులను పరిశీలించిన తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు ⇒ ఇప్పటికే గ్యాప్ సర్టిఫికేషన్‌తో పాటు వివిధ ఏజెన్సీల ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే పంట ఉత్పత్తులకు రిజి్రస్టేషన్ చేసుకుంటే నిర్దేశిత కాలపరిమితిలో ప్రమాణాలు పాటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంది ⇒ సేంద్రీయ వ్యవసాయం కోసం తప్పనిసరిగా భూమిని మార్చాలి ⇒ సేంద్రీయ పద్ధతుల్లోనే సాగు చెయ్యాలి ⇒ ఇన్పుట్స్ అన్నీ సహజంగానే ఉండాలి ⇒ కలుపు మొక్కల నివారణతో సహా తెగుళ్లు, వ్యాధులను సహజ పద్ధతుల్లో మాత్రమే నియంత్రించాలి ⇒ 25 ఎకరాల లోపు సన్న, చిన్న కారు రైతులతో పాటు 25 ఎకరాలకు పైబడిన పెద్ద రైతులతో 25 నుంచి 500 మంది సభ్యులతో కూడిన రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాసెసర్స్, రిటైలర్స్, ఎగుమతిదారులు ఎవరైనా సేంద్రీయ సాగు కోసం రిజి్రస్టేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ⇒ దశలవారీగా తనిఖీలు, పరీక్షల అనంతరం సర్టిఫికేషన్ ఇస్తారు ⇒ వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులతో పాటు సమీప భవిష్యత్తులో అటవీ సేకరణలు, ఏపి కల్చర్, ఆక్వా కల్చర్, సముద్రపు నాచు, జల మొక్కలు, పుట్ట గొడుగుల ఉత్పత్తి, పశువుల ఉత్పత్తుల ప్రాసెసింగ్ అండ్ హ్యాండలింగ్, జంతువుల ఫీడ్ ప్రొసెసింగ్‌కు ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేషన్‌తో రైతుకు మేలు సేంద్రీయ ధ్రువీకరణకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఎపెడా గుర్తింపునిచి్చంది. 2027 వరకు లైసెన్సు జారీ చేసింది. ఆ తర్వాత మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఈ గుర్తింపు ద్వారా నాణ్యమైన ఆహార ఉత్పత్తులకు ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుని వరకు భరోసా లభిస్తుంది. రసాయన అవశేషాల్లేని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులు పొందే వీలు కలుగుతుంది. మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడడం, ఎగుమతులు పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మొక్కలు, జంతువుల్లో జీవ వైవిధ్యతను కాపాడేందుకు సేంద్రీయ వ్యవసాయ సుస్థిరత, పర్యావరణ హితమైన ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. –ఎ.త్రివిక్రమరెడ్డి, డైరెక్టర్, ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ