మరియమ్ ఆసిఫ్ సిద్ధికీ
భగవద్విజేత
‘ధ్రువతార’ అనే మాట మరియమ్ ఆసిఫ్ సిద్ధికీకి వయసుకు మించిన అన్వయమే అవుతుంది. కానీ పన్నెండేళ్ల ఈ ముంబై బాలిక.. మత వైషమ్యాలు లేని భవిష్యత్ ప్రపంచాన్ని దృగ్గోచరం చేయించే ధ్రువతారగా వెలుగొందడం చూస్తుంటే ‘ఫర్వాలేదు, మానవజాతి సురక్షితమైన చేతుల్లోకే వెళ్లబోతోంది’ అని నమ్మకం కలుగుతుంది. ఇంతకీ మరియమ్ సాధించిందేమిటి? తనైతే ఏమీ సాధించలేదనే అంటోంది! ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్) ఇటీవల ముంబైలో నిర్వహించిన ‘గీత చాంపియన్స్ లీగ్’ పోటీలో మరియమ్ విజేతగా నిలిచింది. హిందూ మత సౌధానికి మూలస్తంభాలలో ఒకటైన భగవద్గీతలోని సంక్లిష్టతను ఒక ముస్లిం బాలిక అర్థం చేసుకుని, అందులోని సూక్ష్మాన్ని గ్రహించి పరీక్షలో ప్రథమ బహుమతి సాధించడం నిస్సందేహంగా గొప్ప సంగతే. అయితే తనొక ముస్లిం అయినందువల్లనే తనకీ గొప్పతనాన్ని ఆపాదిస్తున్నట్లయితే కనుక అది పొరపాటు అవుతుందని మరియమ్ అంటోంది. ‘‘గొప్పదనం ఏదైనా ఉంటే, అది మన ఆధ్యాత్మిక గ్రంథాలదే. అవి ప్రబోధిస్తున్న విధంగా మనం ఒకరికోసం ఒకరం జీవించాలి. అదే జీవిత పరమార్థం’’ అంటోంది మరియమ్. ముంబై మీరా రోడ్డులోని కాస్మోపాలిటన్ హైస్కూల్‌లో ఆరవ తరగతి చుదువుతున్న మరియమ్ ఇప్పటికే ఖురాన్, బైబిల్‌లను క్షణ్ణంగా చదివి వాటి సారాన్ని అర్థం చేసుకుంది.
ఇప్పుడు 195 స్కూళ్ల నుంచి ఇస్కాన్ భగవద్గీత పరీక్షకు హాజరైన 4,617 మంది విద్యార్థులతో పోటీ పడి ప్రథమ బహుమతి గెలుచుకుంది. పరీక్ష నిర్వహించే రెండు వారాల ముందు ఇస్కాన్ ఇంగ్లీషులోకి తర్జుమా అయి ఉన్న భగవద్గీత పుస్తకాలను ప్రిపరేషన్ కోసం పిల్లలకు పంచిపెట్టింది. మహాభరతం, శ్రీకృష్ణ ప్రవచనాలు అని రెండు భాగాలుగా విభజించి ఒక్కో భాగం నుంచి 50 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని ఇచ్చింది. వాటన్నిటికీ మరియమ్ సరైన సమాధానాలు ఇచ్చింది. ‘‘భగవద్గీతలో నాకు ఇష్టమైన ఘట్టం... యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగే సంభాషణ’’ అని చెబుతూ, ‘‘ఏ మతము కూడా హింసను ప్రబోధించడం లేదు, కానీ మనమే ఆ ప్రవచనాలను అపార్థం చేసుకుని ఒకరిపై ఒకరం ద్వేషభావాన్ని పెంచుకుంటున్నాం’’ అని చిన్నారి మరియమ్ విచారం వ్యక్తం చేసింది.