బీమాపై అవగాహన పెరగాలంటే..?
ఊహించని పరిణామాలు జరిగి మనకేమన్నా అయితే మనపై ఆధారపడ్డ వారికి ఆర్థిక తోడ్పాటునందిస్తుంది మనం మనకు తీసుకున్న జీవిత బీమా. అలాగే ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో లైఫ్ ఇన్సూరెన్స్ ఒక భాగం కూడా. ఈ విషయాలను పక్కన పెడితే.. దేశంలో బీమా కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నట్లు అనిపిస్తుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్‌లో బీమా తీసుకున్న వారు కేవలం 3.1 శాతంగా ఉన్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చినా కూడా ఇది తక్కువే.
గత కొన్నేళ్లలో ఇన్సూరెన్స్ విస్తరణ మెరుగుపడుతున్నప్పటికీ.. వృద్ధి మాత్రం ఆశించినంత స్థాయిలో లేదు. దీనికి కారణం ఇన్సూరెన్స్ పాలసీల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. ముందుగా బీమా కంపెనీల వ్యాపార విధానాల్లో, వినియోగదారుల ఆలోచనా సరళిలో మార్పు రావాలి.
ఇప్పటికీ అధిక సంఖ్యాక ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం ప్రధానంగా ఇన్సూరెన్స్ కన్సల్టెంట్స్ ద్వారానే జరుగుతోంది. అలాగే ఆన్లైన్లో పాలసీ ఎంపికపై వినియోగదారుల్లో అవగాహన కూడా పెరుగుతోంది. బీమా కంపెనీ, పాలసీ ఎంపిక వంటి తదితర అంశాల్లో ఈనాటి కస్టమర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. కావలసిన పాలసీ గురించి తెలుసుకోవడానికి, ఇతర వాటితో పోల్చుకోవడానికి ప్రస్తుతం అనేక వ నరులు అందుబాటులో ఉన్నాయి. కొందరైతే ఆన్లైన్లో పాలసీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఏజెంట్ ద్వారా పాలసీని తీసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులను ఈ సన్నివేశం ప్రతిబింబిస్తోంది. అంటే బీమా సంస్థలు కస్టమర్లతో మాట్లాడటానికి ఇంకా కొత్త మార్గాలను, విధానాలను రూపొందించుకోవాల్సి ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాల కస్టమర్లతో మాట్లాడడానికి వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పకుండా తగిన మార్గాలను అన్వేషించుకోవాలి. వినియోగదారులతో సమావేశమవ్వడం, పాలసీల గురించి వారికి తెలియజెప్పడం వంటి తదితర కార్యక్రమాలను చేపట్టాలి. కస్టమర్ల సందేహాలను, సమస్యలను నివృత్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ కార్యక్రమాల ద్వారా ఆయా కంపెనీలు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు? కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను తెలుసుకోవాలి.
బీమా రంగం ప్రొడక్ట్‌ను విక్రయించడమనే వ్యూహం నుంచి కస్టమర్లే ప్రొడక్ట్‌ను తీసుకునే వ్యూహంవైపు క్రమంగా అడుగులు వేస్తోంది. బీమా కంపెనీలు వినియోగదారులకు అవసరమైన, అనువైన ప్రొడక్ట్స్‌ను రూపొందించాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేయాలన్నా వాటికి కస్టమరే ప్రధాన బిందువనే అంశాన్ని అవి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి.
- అనుజ్ అగర్వాల్
బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో