polio cases
-
Polio virus: పదేళ్ల తర్వాత పోలియో కలకలం.. తొలి కేసు నమోదు!
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు దశాబ్దం తర్వాత పోలియో కలకలం సృష్టించింది. పదేళ్ల తర్వాత తొలి కేసు నమోదైనట్లు అమెరికా గురువారం ప్రకటించింది. రాక్లాండ్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్‌గా తేలినట్లు న్యూయార్క్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. వ్యాధుల నియంత్రణ నిర్మూల కేంద్రం వివరాల ప్రకారం.. అమెరికాలో చివరి సారిగా 2013లో పోలియో కేసు నమోదైంది. నోటి ద్వారా పోలియే వ్యాక్సిన్(ఓపీవీ) తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ సోకినట్లు నిపుణులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలోనే నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌కు స్వస్తి పలికింది అమెరికా. ‘ అమెరికా వెలుపల ఓపీవీ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. అధునాత వ్యాక్సిన్ల ద్వారా కొత్త రకాలు ఉద్భవించవు.’ అని పేర్కొంది న్యూయార్క్ ఆరోగ్య విభాగం. వైరస్ వ్యాప్తిని గుర్తించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించింది. పోలియో టీకా తీసుకోని ప్రజలు వెంటనే వేసుకోవాలని హెచ్చరించింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయంగా చేస్తున్న కృషి వల్ల పోలియో అంతరించే స్థాయికి చేరుకుంది. ఈ వైరస్ ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలపైనే అధిక ప్రభావం చూపుతుంది. 1988 నుంచి కొత్త కేసులు 99 శాతం తగ్గాయి. అప్పటి నుంచి 125 దేశాలను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. మొత్తం 3,50,000 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మాత్రం 1960లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టాయి. నేరుగా పోలియో సోకిన కేసు 1979లో నమోదైంది. ఇదీ చదవండి: New Polio Virus In London: పోలియో వైరస్ కొత్త టైప్ గుర్తింపు. ఏ రూపంలో అయినా ముప్పే! -
పాకిస్తాన్ లో 80 శాతం పోలియో కేసులు
ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పోలియోకేసుల్లో దాదాపు అధికశాతం కేసులు పాకిస్థాన్ లోనే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) పేర్కొంది. పాకిస్తాన్ లో 80శాతం పోలియో కేసులు నమోదు అవుతున్నాయని తాజాగా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో వ్యాధి నిరోధక టీకా మందు పిల్లలకు సక్రమంగా అందుబాటులో లేకపోవడం, ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో వ్యాధి నిరోధక కార్యక్రమాలపై మిలిటెంట్ల నిషేధం కొనసాగడం, క్షేత్రస్థాయిలో పోలియో చుక్కల మందు వేసే పోలియో నిరోధక కార్యకర్తలను హతమార్చడం వంటి కారణాలవల్ల పోలియో నిరోధక కార్యక్రమం సరిగా అమలు కావడం లేదని తెలిపింది. వ్యాధి నిరోధక కార్యక్రమం పిల్లలకు అందుబాటులో ఉంచడం, వ్యాధినిరోధక కార్యక్రమంలో విధులు నిర్వహించే వారి భద్రత తదితర అంశాలను పరిష్కరించినపుడే పోలియో నిర్మూలన సంపూర్ణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో సూచించింది. -
'80 శాతం పోలియో కేసులు పాక్‌లోనే'
ఇస్లామాబాద్: ప్రపంచంలో 80 శాతం పోలియో కేసులు పాకిస్థాన్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో ) వెల్లడించింది. అందుకు పాకిస్థానే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిపై ప్రగతి నివేదికను డబ్ల్యూహెచ్‌వో ఇక్కడ విడుదల చేసింది. దేశంలో పోలియో కేసులు రోజురోజూకు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై తీవ్రవాదులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలియో నిర్మూలన కోసం పాటుపడుతున్న ప్రచారకర్తలను తీవ్రవాదులు అత్యంత పాశవికంగా చంపేస్తున్నారు. ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ లో ఈ పరిస్థితి అధికంగా ఉందని తెలిపింది. దీంతో పాకిస్థాన్‌లో పోలియో కేసులు ఉద్ధృతమవుతున్నాయి. -
రేపు పల్స్‌పోలియో
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 19-21 తేదీల్లో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆదివారం, 20, 21న ఇంటింటికి తిరిగి 0-5ఏళ్ల లోపు పిల్లలకు చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1998 సంవత్సరం నుంచి జిల్లాలో, 2011 నుంచి దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదని తెలిపారు. పొరుగు దేశాల్లో ఉన్న పోలియో మన దేశానికి వ్యాపించే ప్రమాదమున్న దృష్ట్యా ప్రభుత్వం పల్స్‌పోలియోను నిర్వహిస్తోందన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల నిండు జీవితానికి పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత జిల్లాగా మార్చడానికి సహకరించాలని కోరారు. రెండవ విడత పల్స్‌పోలియో ఫిబ్రవరి 23-25 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 4,26,273 మంది 0-5 సంవత్సరాలు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 2,840 చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతంలో 2,415, పట్టణ ప్రాంతంలో 425 కేంద్రాలతో పాటు 86 మొబైల్ కేంద్రాలు, 44 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 299 ప్రమాద తీవ్రత కేంద్రాలను గుర్తించామన్నారు. 5,312 కుటుంబాలు, 3,361 మంది ఐదేళ్లలోపు పిల్లలు ప్రమాద తీవ్రత ప్రదేశాలలో నివసిస్తున్నట్లు గుర్తించి ప్రత్యేక దృష్టిసారించామన్నారు. జిల్లావ్యాప్తంగా 284 మంది పర్యవేక్షకులను నియమించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతంలో మున్సిపల్ సీనియర్ ప్రోగ్రాం హెల్త్ అధికారులు పర్యవేక్షకులుగా ఉంటారన్నారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా క్షయ నివారణ అధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, డీటీటీ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా స్కూల్‌హెల్త్ కో ఆర్డినేటర్లకు 3-4 క్లస్టర్లను, తీవ్రత గల ప్రాంతాలను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ మనోహర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అలీం, డీఎంహెచ్‌వో కె.బాలు పాల్గొన్నారు. పరిశీలకుడుగా మాణిక్యరావు పల్స్‌పోలియో జిల్లా పరిశీలకుడిగా డాక్టర్ మాణిక్యరావును ప్రభుత్వం నియమించింది. ఆయన వరంగల్‌లో వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.