ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పోలియోకేసుల్లో దాదాపు అధికశాతం కేసులు పాకిస్థాన్ లోనే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పేర్కొంది. పాకిస్తాన్ లో 80శాతం పోలియో కేసులు నమోదు అవుతున్నాయని తాజాగా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో వ్యాధి నిరోధక టీకా మందు పిల్లలకు సక్రమంగా అందుబాటులో లేకపోవడం, ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో వ్యాధి నిరోధక కార్యక్రమాలపై మిలిటెంట్ల నిషేధం కొనసాగడం, క్షేత్రస్థాయిలో పోలియో చుక్కల మందు వేసే పోలియో నిరోధక కార్యకర్తలను హతమార్చడం వంటి కారణాలవల్ల పోలియో నిరోధక కార్యక్రమం సరిగా అమలు కావడం లేదని తెలిపింది.
వ్యాధి నిరోధక కార్యక్రమం పిల్లలకు అందుబాటులో ఉంచడం, వ్యాధినిరోధక కార్యక్రమంలో విధులు నిర్వహించే వారి భద్రత తదితర అంశాలను పరిష్కరించినపుడే పోలియో నిర్మూలన సంపూర్ణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో సూచించింది.