
రైలులోని తమ ఆప్తుల గురించి క్వెట్టా స్టేషన్‌లో వివరాలు తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులు..
తమను పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్న బలూచ్ తెగ ప్రజలు
సాయుధ ఉద్యమపంథాలో కొనసాగుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
తరచూ సైన్యం, ప్రభుత్వ ఆస్తులపై దాడులు
సైన్యం, బీఎల్‌ఏ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజలు
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఏకంగా రైలునే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎ ల్‌ఏ) తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో బలూ చిస్తాన్ స్వయంప్రతిపత్తి అంశం మరోసారి తెరమీదకొచ్చింది. పాతికేళ్లుగా సాయుధ ఉద్య మపంథాను అనుసరిస్తున్న బీఎల్‌ఏ మూలాలు ఆ ప్రాంత ప్రజల అసంతృప్తి, ఆగ్ర హంలో ఉన్నాయి. బలవంతంగా తమను స్వతంత్ర పాక్‌లో కలిపేసి తమ అభివృద్ధిని కాల రాశారని బలూచ్ ప్రజలు భావిస్తుండటమే ఈ ఉద్యమం ఇంకా కొనసాగడానికి అసలు కారణం.
ఎవరీ బలూచ్‌లు?
పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతాన్ని బలూచిస్తాన్‌గా పిలుస్తారు. ఇది పాక్‌లోని ఒక ప్రావిన్స్‌గా కొనసాగుతోంది. ఇక్కడ స్థానిక బలూచ్ తెగ ప్రజల పూర్వీకులు సమీప ఇరాన్, అఫ్గానిస్తాన్‌లోనూ స్థిరపడ్డారు. ఇరాన్‌కు ఆగ్నేయంగా, అఫ్గానిస్తాన్‌కు దక్షిణంగా ఈ సువిశాల ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 3,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న బలూచ్ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆమడదూరంలో నిలిచిపోయింది. ఇక్కడ జనాభా కూడా అత్యల్పం. మొత్తం పాక్ విస్తీర్ణంలో బలూచ్ 44 శాతం ఉంటుంది. దశాబ్దాలక్రితం స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన బలూచిస్తాన్‌ను ఆ తర్వాత బ్రిటిషర్లు ఆక్రమించి స్థానిక కలాట్ సంస్థానం(ఖానేట్) పాలకుడు ఖాన్‌కు పరిపాలనా బాధ్యతలు అప్పగించారు.
1948 మార్చి 27వ తేదీన బలూచిస్తాన్‌ను పాకిస్తాన్‌లో అధికారికంగా విలీనం చేశారు. ఈ విలీన ప్రక్రియను నాటి బలూచిస్తాన్ పాలకుల్లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వ్యతిరేకతే తదనంతరకాలంలో తీవ్ర నిరసనగా, వేర్పాటువాదంగా చివరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ)గా అవతరించింది. 1948, 1958–59, 1962–63, 1973–77 కాలాల్లో బలూచ్ స్వతంత్య్ర ఉద్యమాలు కొనసాగిన నాటి పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆ ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేశాయి. ఈ కాలంలో వేలాది మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు.
అక్కడి కీలక బలూచ్ నేతలు కొందరు దేశం వీడారు. కొందరు ముఖ్యనేతలు హత్యకు గురయ్యారు. 2003 ఏడాది నుంచి మళ్లీ బీఎల్‌ఏ ఆవిర్భావంతో స్వతంత్ర బలూచ్ కోసం పోరాటం ఉధృతమైంది. సాయుధ బాటలో పయనిస్తూ తరచూ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ ఆస్తులు, పౌరులపై దాడులకు తెగబడుతోంది. బలూచ్ ప్రజల స్వయంనిర్ణయాధికారం, పాకిస్తాన్ నుంచి విడివడి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలన్న లక్ష్యాలతో బీఎల్‌ఏ పోరాడుతోంది. ఉద్యమా న్ని అణచివేసే క్రమంలో తీవ్రస్థాయిల మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్‌పై అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
అపార సంపద
పర్వతమయ బలూచిస్తాన్‌లో అపార సహజసంపద సందప దాగి ఉంది. ఇక్కడ సహజవాయు నిక్షేపాలు ఎక్కువ. దక్షిణ పాకిస్తాన్‌లో అరేబియా సముద్రతీరం వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గ్వాదర్ పోర్ట్ బలూచిస్తాన్‌లోనే ఉంది. సరకు రవాణాకు అనువైన ప్రాంతం. దీంతో చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపెక్)ను నిర్మించాలని చైనా తలపోయడం తెల్సిందే. ఈ సీపెక్ బలూచిస్తాన్ గుండా వెళ్తుంది.
సీపెక్ ఈ ప్రాంత అభివృద్ధిని పెంచుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుండగా తమ ప్రాంత సంపదను కొల్లగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక బలూచ్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఇక్కడ సీపెక్ సంబంధ ప్రాజెక్టులపై తరచూ దాడులుచేస్తున్నారు. ముఖ్యంగా చైనా సిబ్బందిని బీఎల్‌ఏ లక్ష్యంగా చేసుకుంది. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని బలూచ్ ప్రాంతవాసుల్లో ఒక అభిప్రాయం గూడుకట్టుకుపోయింది.
ఇది బీఎల్‌ఏ సాయుధపోరుకు నైతిక, ఆర్థిక స్థైర్యాన్ని ఇస్తోంది. బీఎల్‌ఏకు పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. దీంతో వేర్పాటువాదం బాటలో పయనిస్తున్న బీఎల్‌ఏను ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లు ఉగ్రసంస్థగా ప్రకటించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment