పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సబ్‌స్టేషన్
పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంగళవారం ఈపీడీసీఎల్ సీఎండీ ఎంఎం నాయక్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. 20 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. డంపింగ్‌ల కారణంగా పోలవరం ప్రాంతంలో విద్యుత్ లైన్లు, స్తంభాలు మార్చాల్సి వస్తే అంచనాలు పంపాలని ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. ట్రాన్స్ట్రాయ్ ఏజెన్సీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ కె.తిరుమలేశ్, ట్రాన్స్‌కో ఏడీ కె.నరసింహమూర్తి, డీఈ ఆర్.సాల్మన్‌రాజు, ప్రాజెక్టు ఈఈ పి.కుమార్ పాల్గొన్నారు.
స్పిల్‌వే గేట్ల నిర్మాణ పనుల పరిశీలన
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే ప్రాంతంలో గేట్ల నిర్మాణ పనులను ప్రాజెక్ట్ అధారిటీ కమిటీ సభ్యుడు ఓంకార్‌సింగ్, రాజీవ్ జస్వాల మంగళవారం పరిశీలించారు. మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రెండు గేట్ల నిర్మాణం పూర్తయ్యిందని, మరో రెండు గేట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. నిర్మాణానికి వినియోగించే స్టీల్ నాణ్యత, గేట్లు తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రాజెక్ట్ ఈఈ పి.బుల్లియ్య వారి వెంట ఉన్నారు.