
పోలవరం చుట్టూ పోలీస్ పికెటింగ్
పశ్చిమ గోదావరి జిల్లా: పోలవరంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి పోలవరం చుట్టూ పోలీస్ పికెటింగ్ నిర్వహించాలని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల రాకపోకలపై నిఘా కట్టుదిట్టం చేయాలన్నారు. 2018కల్లా పోలవరం పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు. అనుమతుల కోసం అవసరమైతే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని ఆధికారులకు చంద్రబాబు సూచించారు.
మరో వైపు ఏలేరులో 25 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకే.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథంకం చేపట్టామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు మేలు కలుగుతుందని అన్నారు. వంశధార, నాగావళిని అనుసంధానం చేసి.. ఇచ్చాపురం వరకూ నీళ్లు తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు. పరిశ్రమలు, పట్టణీకరణ కూడా రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు కానున్న మెగా ఆక్వాఫుడ్ పార్కుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.