Poly CET
-
కోరుకున్న చోట సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో చేరే విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం తమ ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకోసం ఒక్కోసారి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి, తమకు నచ్చిన తేదీల్లో, వీలైన సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేనుంది. శుక్రవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని అన్ని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ప్రవేశాల షెడ్యూల్ ప్రకటించాక నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అయితే ఇందులో ప్రతి గంటను ఒక స్లాట్‌గా విభజిస్తారు. విద్యార్థులు అందులో ఏదో ఒక రోజులో వీలైన ఏదో ఒక సమ యాన్ని ఫీజు చెల్లించాక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ క్రమంలో విద్యార్థి ఆన్లైన్లో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని, సమయాన్ని ఎంచుకోవాలి. అలా స్లాట్ బుక్ చేసు కున్న విద్యార్థి సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు నిర్ణీత సమయంలో వెళ్లి తమ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. పాలిసెట్ కౌన్సెలింగ్ నుంచి ప్రారంభం ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ నుంచి దీనిని అమల్లోకి తీసుకువస్తోంది. విద్యార్థి ఒకవేళ నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని పరిస్థితి ఉంటే ప్రవేశాల కమిటీకి మెయిల్ ఐడీకి మెయిల్ చేస్తే అతనికి తర్వాత వెరిఫికేషన్ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. దీన్ని పాలిసెట్కే కాకుండా ఎంసెట్, ఈసెట్ వంటి ఇతర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ల్లోనూ అమలు చేయనున్నట్లు వివరించారు. -
రేపటి నుంచి పాలీసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో విద్యార్థులు వెరిఫికేషన్‌కు హాజరు కావాలని తెలిపారు. ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండు దఫాలుగా ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. ఇక విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 2వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని వివరించారు. 5వ తేదీన సీట్లను కేటాయించి, తమ వెబ్సైట్ (https://tspolycet.nic.in)లో అందుబాటులో ఉంచ నున్నట్లు తెలిపారు. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొన్నారు. వికలాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కేటగిరీలకు చెందిన వారికి ఈ నెల 25, 26 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దాదాపు 60 వేల సీట్లను భర్తీ చేయనున్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించిన పాలిసెట్-2014 జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కడప నగరంలోని 9 కేంద్రాల్లో 3,281 మంది అభ్యర్థులకు గాను 3,050 మంది పరీక్ష రాశారు. ప్రొద్దుటూరులో 11 కేంద్రాల్లో 3,004 మందికి గాను 2,875 మంది, రాజంపేటలో 3 కేంద్రాల్లో 458 మందికి గాను 429 మంది హాజరయ్యారు. పరీక్షా సమయానికి గంట ముందుగానే విద్యార్థులను అనుమతించడంతో ఎక్కడా ఆలస్యంగా వచ్చిన కేసులు నమోదు కాలే దు. పరీక్ష ఉదయం 11 నుంచి 1 గంట వర కు సాగింది. పరీక్షాకేంద్రాలను అధికారు లు పర్యవేక్షించారు. -
కెరీర్ కౌన్సెలింగ్
నేను పదో తరగతి పూర్తిచేశాను. పాలిటెక్నిక్‌లో చేరాలనుకుంటున్నాను. దీనిలో ప్రవేశం ఎలా ఉంటుంది. ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలను వివరించండి? పదో తరగతి పూర్తిచేసినవారి ముందున్న చక్కని అవకాశం పాలిటెక్నిక్ కోర్సులు. ఇందులో మూడేళ్ల/మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ ఏడాది మే 21న పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్కండీషనింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: 35 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక: పాలిసెట్‌లో ర్యాంకు ఆధారంగా.. పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ (60 ప్రశ్నలు), ఫిజిక్స్ (30 ప్రశ్నలు), కెమిస్ట్రీ (30 ప్రశ్నలు)ల నుంచి ప్రశ్నలడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. ఇందులో కనీసం 30 శాతం (36 మార్కులు) సాధించాలి. ఉన్నతవిద్య: పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఉన్నత విద్య పరంగా మంచి అవకాశాలున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులకు నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) రాసి నేరుగా బీటెక్/బీఈ రెండో ఏడాదిలో ప్రవేశించవచ్చు. తద్వారా సంబంధిత/అనుబంధ బ్రాంచ్‌తో బీటెక్ పూర్తిచేయొచ్చు. తర్వాత గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) రాసి ఎంటెక్/ఎంఈ అభ్యసించవచ్చు. అనంతరం సీఎస్ఐఆర్-నెట్, గేట్ రాసి పీహెచ్డీ కూడా చేయొచ్చు. ఉద్యోగావకాశాలు: పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలపరంగా ఎలాంటి ఢోకాలేదు. సివిల్ ఉత్తీర్ణులకు వివిధ నిర్మాణ రంగ కంపెనీలు, ఇరిగేషన్, రోడ్లు, రైల్వేలు, సర్వే, నీటి సరఫరా విభాగాలు పెద్దపీట వేస్తున్నాయి. మెకానికల్ పూర్తిచేసినవారికి వివిధ వాహన, వస్తు తయారీ కర్మాగారాలు, వర్క్‌షాప్స్, గ్యారేజెస్, ప్రొడక్షన్ యూనిట్స్‌లో ఉద్యోగాలు ఉంటాయి. ఆటోమొబైల్ ఉత్తీర్ణులు ఏపీఎస్ఆర్టీసీ, వివిధ రవాణా విభాగాలు, ఆటోమొబైల్స్ షోరూమ్స్‌ల్లో అవకాశాలు పొందొచ్చు. ప్యాకేజింగ్ టెక్నాలజీ పూర్తిచేసినవారికి ప్యాకేజింగ్ పరిశ్రమలు, పేపర్ తయారీ కర్మాగారాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఫుడ్ అండ్ బేవరేజెస్లో ఉద్యోగాలు ఉంటాయి. ఈఈఈ ఉత్తీర్ణులు ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కోల్లో జాబ్స్ పొందొచ్చు. ఈసీఈ ఉత్తీర్ణులకు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, కమ్యూనికేషన్స్, దూరదర్శన్ మొదలైన విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు. మిగిలిన బ్రాంచ్‌ల ఉత్తీర్ణులకు కూడా ఆయా విభాగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే జూనియర్ ఇంజనీర్స్ పరీక్ష రాసి ఆయా విభాగాల్లో ఇంజనీర్ కావచ్చు. వెబ్సైట్: https://apceep.nic.in/