కెరీర్ కౌన్సెలింగ్
నేను పదో తరగతి పూర్తిచేశాను. పాలిటెక్నిక్‌లో చేరాలనుకుంటున్నాను. దీనిలో ప్రవేశం ఎలా ఉంటుంది. ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలను వివరించండి?
పదో తరగతి పూర్తిచేసినవారి ముందున్న చక్కని అవకాశం పాలిటెక్నిక్ కోర్సులు. ఇందులో మూడేళ్ల/మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ ఏడాది మే 21న పాలిసెట్‌ను నిర్వహించనున్నారు.
కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: 35 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత.
ఎంపిక: పాలిసెట్‌లో ర్యాంకు ఆధారంగా..
పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ (60 ప్రశ్నలు), ఫిజిక్స్ (30 ప్రశ్నలు), కెమిస్ట్రీ (30 ప్రశ్నలు)ల నుంచి ప్రశ్నలడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. ఇందులో కనీసం 30 శాతం (36 మార్కులు) సాధించాలి.
ఉన్నతవిద్య: పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఉన్నత విద్య పరంగా మంచి అవకాశాలున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులకు నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) రాసి నేరుగా బీటెక్/బీఈ రెండో ఏడాదిలో ప్రవేశించవచ్చు. తద్వారా సంబంధిత/అనుబంధ బ్రాంచ్‌తో బీటెక్ పూర్తిచేయొచ్చు. తర్వాత గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) రాసి ఎంటెక్/ఎంఈ అభ్యసించవచ్చు. అనంతరం సీఎస్‌ఐఆర్-నెట్, గేట్ రాసి పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.
ఉద్యోగావకాశాలు: పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలపరంగా ఎలాంటి ఢోకాలేదు. సివిల్ ఉత్తీర్ణులకు వివిధ నిర్మాణ రంగ కంపెనీలు, ఇరిగేషన్, రోడ్లు, రైల్వేలు, సర్వే, నీటి సరఫరా విభాగాలు పెద్దపీట వేస్తున్నాయి. మెకానికల్ పూర్తిచేసినవారికి వివిధ వాహన, వస్తు తయారీ కర్మాగారాలు, వర్క్‌షాప్స్, గ్యారేజెస్, ప్రొడక్షన్ యూనిట్స్‌లో ఉద్యోగాలు ఉంటాయి. ఆటోమొబైల్ ఉత్తీర్ణులు ఏపీఎస్‌ఆర్‌టీసీ, వివిధ రవాణా విభాగాలు, ఆటోమొబైల్స్ షోరూమ్స్‌ల్లో అవకాశాలు పొందొచ్చు.
ప్యాకేజింగ్ టెక్నాలజీ పూర్తిచేసినవారికి ప్యాకేజింగ్ పరిశ్రమలు, పేపర్ తయారీ కర్మాగారాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఫుడ్ అండ్ బేవరేజెస్‌లో ఉద్యోగాలు ఉంటాయి. ఈఈఈ ఉత్తీర్ణులు ఏపీజెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కోల్లో జాబ్స్ పొందొచ్చు. ఈసీఈ ఉత్తీర్ణులకు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, కమ్యూనికేషన్స్, దూరదర్శన్ మొదలైన విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు. మిగిలిన బ్రాంచ్‌ల ఉత్తీర్ణులకు కూడా ఆయా విభాగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే జూనియర్ ఇంజనీర్స్ పరీక్ష రాసి ఆయా విభాగాల్లో ఇంజనీర్ కావచ్చు. వెబ్‌సైట్: https://apceep.nic.in/