చర్చలు సఫలం.. ముగిసిన సమ్మె
• ఒప్పంద కూలి ఇవ్వాల్సిందే
• వస్త్రం అమ్మకపోతే ఉత్పత్తి తగ్గించండి
• కూలి తగ్గించిన వారిపై చర్యలు
• సిరిసిల్ల నోడల్ అధికారి, ఏజేసీ నాగేంద్ర
సిరిసిల్ల : సిరిసిల్లలో పాలిస్టర్ యజమానులు ఒప్పంద కూలిని ఆసాములకు ఇవ్వాల్సిందేనని, కూలి తగ్గించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల నోడల్ అధికారి, ఏజేసీ ఏ.నాగేంద్ర హెచ్చరించారు. స్థాని క పొదుపు భవనంలో బుధవారం పాలిస్టర్ యజమానులు, ఆసాములతో చర్చలు జరి పారు. పాలిస్టర్ వస్త్రం అమ్ముడుపోవడంలేద ని, నిల్వలు పేరుకుపోయూయని యజమానులు స్పష్టం చేయగా.. వస్త్రం అమ్ముడుపోకపోతే ఉత్పత్తిని తగ్గించాలని ఏజేసీ సూచిం చారు.
24 గంటలు ఉత్పత్తి చేయకుండా 8 గంటల చొప్పున రెండు షిప్ట్‌ల్లో 16 గంటలే పని ఇవ్వాలన్నారు. అవసరమైతే వారంలో రెం డు రోజులు హాలీడే ప్రకటించాలని తెలిపారు. పది పిక్కులకు పెద్దపన్నకు 46.5పైసలు, చిన్న పన్నకు 43.5పైసలు చెల్లించాల్సిందేనన్నారు. కూలి తగ్గించే వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 5హెచ్‌పీ వరకు 8 సాంచాలకే విద్యుత్ సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. కుటీర పరిశ్రమల విద్యుత్ రాయితీ పొందుతున్న పెద్ద యజమానులపై చర్యలు తీసుకోవచ్చని, కానీ ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చట్టాలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఒప్పంద కూలిని అమలు చేయూలని తెలిపారు. నేతన్నల రుణమాఫీ అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ఏజేసీ తెలిపారు.
సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్ మాట్లాడుతూ కొత్త కూలి అమలు చేయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త కూలి అమలుకు యజమానులు అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆసాముల సంఘం వెల్లడించింది. సమావేశంలో జౌళిశాఖ ఏడీ ఎం.వెంకటేశం, తహశీల్దార్ జి.శంకరయ్య, అసిస్టెంట్ లేబర్ అధికారి ఎం.ఏ.రఫీ, పాలిస్టర్ అసోసియేషన్ కార్యదర్శి గాజుల నారాయణ, యజమానుల సంఘం నాయకులు కల్యాడపు సుభాష్, గోవిందు రవి, కనకరాజేశం, కార్మిక నాయకులు సామల మల్లేశం, పంతం రవి, మూషం రమేశ్, పోలు కొమురయ్య, ఆసాముల సంఘం నాయకులు దాసరి వెంకటేశం, వెంగళ అశోక్, తన్నీరు లక్ష్మీరాజం, కోడం శంకర్, బూర రాజేశం, బండారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.