నిషేధం ఉత్తమాటే
ప్రధాన కూడళ్ల నిండా ప్లెక్సీలు
పట్టించుకోని అధికారులు
కరీంనగర్ కార్పొరేషన్ :‘పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాం. నా పుట్టిన రోజున కూడా ఎవరూ ఫ్లెక్సీలు కట్టవద్దు. ఒక వేళ తెలియక ఏర్పాటు చేసినా వాటిని తొలగించండి’.. అంటూ నగర మేయర్ రవీందర్‌సింగ్ ఈనెల 5న నగరపాలక టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
మేయర్ ఆదేశాలు మాత్రం నగరంలో ఎక్కడ అమలుకావడం లేదు. ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తూనే ఉన్నాయి. నగరంలోని కూడళ్లు ఫ్లెక్సీలతో నిండిపోతున్నాయి. రోడ్డుపై ఎవరైనా చిరువ్యాపారి చిన్నపాటి డేరా వేస్తే హల్చల్ చేసే అధికారులు నిషేధిత ఫ్లెక్సీల గురించి పట్టించుకోవడం లేదు.
ఈనెల 1న జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి మున్సిపాలిటీల సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కరీంనగర్ నగరపాలక సంస్థ వేగంగా స్పందించింది. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని సైతం లెక్కచేయకుండా కేవలం ఐదు రోజుల్లోనే ఫ్లెక్సీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ప్రతి రోజు ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు దర్శనమిస్తూనే ఉన్నాయి. నిషేధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వారిది ఇష్టారాజ్యమే అవుతుంది. ఒకరిని చూసి ఇంకొకరు అన్నట్లు ఎవరికి వారు కూడళ్లలో తవ్వకాలు చేపడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అయినా అధికారుల్లో స్పందన కరువైంది. చిన్న చిన్న వారిపై ప్రతాపం చూపించడం తమ పని అన్నట్లు కార్పొరేషన్ సిబ్బంది వ్యవహరిస్తున్నారు.
ప్లాస్టిక్‌తో ప్రమాదం
ఫ్లెక్సీలను ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ప్లాస్టిక్‌తో నష్టాలు జరుగుతన్నాయనే ఉద్దేశ్యంతోనే పాలిథీన్ కవర్లతోపాటు ఫ్లెక్సీలను నిషేధిస్తూ మున్సిపాలిటీల సదస్సుతో కేటీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ బొమ్మ ఉన్నా సరే ఫ్లెక్సీని తొలగించాల్సిందేనంటూ ఆదేశించారు. ప్లాస్టిక్ భూమిలో వెయ్యేళ్లు కూడా కలవదు. దీంతో వర్షపు నీరు భూమిలో ఇంకదు. ప్లాస్టిక్ కాల్చిస్తే వెలువడే విషవాయువులతో కేన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయి నిషేధం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీల్లో మాత్రం అమలుకు నోచడం లేదు.
పలుకుబడి ఉంటే చాలు
నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలంటే పలుకుబడి ఉంటే చాలు. ఎవరి అనుమతి అక్కర లేదు. నిషేధం ఉన్నా యథేచ్ఛగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్లెక్సీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలు పెడితే ఇక ఆ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారనే ధీమాతో కూడళ్లలో పచ్చని గడ్డిని తవ్వి మరీ కర్రలు పాతి ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందనే ప్రచారం ఉంది. రాత్రి ఏర్పాటు చేస్తే మళ్లీ రాత్రి వరకు అంటే 24 గంటల పాటు వాటిని తొలగించకుంటే చాలని సిబ్బందితో మాట్లాడు‘కొంటున్నట్లు’ తెలిసింది.
నిషేధం పక్కాగా అమలు చేస్తాం
– రవీందర్‌సింగ్, నగర మేయర్
నగరపాలక సంస్థలో ప్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని నిషేధించాం. పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఫ్లెక్సీలు కడుతున్నారంటే అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఫ్లెక్సీలో ఎవరి ఫొటో ఉన్నా తొలగించాలని చెప్పాం. ఇక నుంచి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది.