అన్నదాతను ఆదుకోవాలి
సత్తుపల్లి, న్యూస్‌లైన్:
కష్టాల్లో.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న జిల్లా రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని కిష్టారంలో బెరుకులు వచ్చిన వరిపంటను గురువారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీడ్స్ పంపిణీ చేసిన వరి విత్తనాలలో నకిలీ విత్తనాలు కలవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాలలో ఆ విత్తనాలు పంపిణీ చేస్తే 55 శాతానికి పైగా బెరుకు విత్తనాలు ఉన్నాయని, దీంతో పంటల దిగుబడి తగ్గిందని వివరించారు.
రాష్ట్ర, జిల్లా అధికారులు రైతులకు జరిగిన నష్టాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు. బెరుకులతో నష్టపోయిన వరిపొలానికి ఎకరాకు రూ.15 వేలు, వర్షం కారణంగా దెబ్బతిన్న పత్తిపంటకు ఎకరాకు రూ.10 వేలు అందించాలని, తడిసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.7 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సీట్ల, ఓట్ల రాజకీయాలను పక్కనబెట్టి రైతుకు ధైర్యం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తెలంగాణపై చిత్తశుద్ధి లేదు..
కేంద్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల ప్రజలను అగ్నిగుండంలో నెట్టి చోద్యం చూస్తోందని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించేదన్నారు. తెలంగాణ ఇచ్చినట్లు ప్రకటించినా సమయం సరిపోదనే సాకుతో నిర్ణయం ప్రకటించడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. కోర్టు అనుమతి ఇస్తే వచ్చే నెల 10, 15 తేదీలలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జగన్ దృష్టికి తీసుకెళ్తా...
జిల్లాలో బెరుకులతో నష్టపోయిన రైతుల పరిస్థితిని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పొంగులేటి భరోసా ఇచ్చారు. మూడు రకాల విత్తనాలు కలవటంతో పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని.. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, అన్నదాతల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయ్‌కుమార్, మున్సిపల్, మండల కన్వీనర్లు కోటగిరి మురళీకృష్ణారావు, పాలకుర్తి యాకోబు,అట్లూరి సత్యనాయణరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి శ్రీనివాసరెడ్డి, రావి సత్యనారాయణ, మహిళా విభాగం కన్వీనర్ చిలుకూరి ఇందిరారెడ్డి, నాయకులు మలిరెడ్డి మురళీరెడ్డి, దాసరి శ్రీధర్‌రెడ్డి, జ్యేష్ఠ లక్ష్మణ్‌రావు, కొడిమెల అప్పారావు, శ్రీశాంత్, చిరంజీవి, గొర్ల అశోక్‌రెడ్డి ఉన్నారు.