ponnal laxmaiah
-
టీఆర్ఎస్ది నిరంకుశ పాలన
వరంగల్: శాసనసభలో జరిగిన గోరంత గొడవను కొండతగా చూపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరు సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయడం రాష్ట్రంలో నిరంకుశ పాలనకు నిదర్శనమని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండలోని రాంనగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల వలయంలో విలేకరుల సమావేశం నిర్వహించే దుస్థితి టీఆర్ఎస్ పాలనలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత భయం దేనికన్నారు. కేసీఆర్ ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ఈ వ్యూహాన్ని రచించారన్నారు. గవర్నర్ ప్రసంగం సభలో కౌన్సిల్ చైర్మన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే ఇది జరిగిందన్నారు. సభ్యులందరికి థర్డ్ పార్టీతో మెడికల్ టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 18రోజుల పాటు చర్చలు జరిపామని, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాల ముందు ఫైళ్లు పెట్టామన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, 34శాతం ప్రజల మద్దతు మాత్రమే టీఆర్ఎస్కు ఉందన్నారు. 66 శాతం ప్రజల మద్దతు లేదన్నారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా, దళితులపై నేరేళ్లలో పోలీసుల దాడికి చర్యలు లేవన్నారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. ఉరిశిక్ష వేసిన ఖైదీని సైతం చివరి క్షణంలో అఖరి కోరిక ఏమిటని అడుగుతారని, సభ్యులను సస్పెండ్ చేసే ముందు కనీసం ఇతర ప్రతిపక్ష సభ్యులను సంప్రదించకుండానే ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి నియంత పాలకులు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయారో సాక్ష్యాలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ నేతల సొంత లాభం కోసం మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు ప్రారంభించారన్నారు. వీటిపై ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉండడంతోనే సభ్యులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరైన వారికి రాజ్యసభ అవకాశం ఇచ్చారని, ఈవిషయంలో సొంత పార్టీలోని వారే బహిరంగ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగా యని గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సహనంతో పనిచేశాయని.. నియంత, అహంకార నేతలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ సభ్యులు నమిండ్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీను, సంపత్‌యాదవ్, నాయిని లక్ష్మారెడ్డితదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ వల్లే మెట్రో భారం: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు వ్యయం ప్రజలపై భారంగా మారడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన కాలయాపనే కారణమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెట్రో పనులు చేస్తే రక్తం ఏరులై పారుతుందని గతంలో కేసీఆర్ బెదిరించారని, సీఎం అయిన తర్వాత ఆయన చేసిన కాలయాపనతోనే ధరలు పెరిగాయని విమర్శించారు. దీనివల్ల ప్రాజెక్టు భారం అదనంగా రూ.3,500 కోట్లు ప్రజలపై పడిందని తెలిపారు. ఈ అదనపు భారానికి కారణమైన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో ధరలు గరిష్టంగా రూ.19 ఉండగా ఇప్పుడు రూ.60 పెంచారని పేర్కొన్నారు. ఈ అదనపు ధరలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మెట్రో పనులను మొదలు పెట్టిందని గుర్తు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైలు వంటివన్నీ కాంగ్రెస్సే ప్రారంభించిందన్నారు. మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య భవిష్యత్ రాజకీయ పొత్తులకు వేదికగా ఈ ప్రారంభ కార్యక్రమం జరిగిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ కేసీఆర్ దగ్గర వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే స్వైన్‌ఫ్లూ: పొన్నాల
హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ప్రబలిందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీ భవన్లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవానికి హాజరైన పొన్నాల పైవిధంగా స్పందించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారు పాలనతో దేశంలో రాజ్యంగా స్ఫూర్తి, లౌకికవాదం పూర్తిగా దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రం విషయానికొస్తే టీఆర్ఎస్ పాలన కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టేలా ఉందంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రయోజనాలను విస్మరిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాకే పెద్దపీట వేస్తూ ఆందోళన తెలంగాణగా మార్చిందని ఆయన మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా స్వైన్‌ఫ్లూ సాకుతో దళిత మంత్రిని బలిపశువును చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని స్వైన్‌ఫ్లూ ని అరికట్టగలిగిందని పొన్నాల సమర్థించుకున్నారు.