సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు వ్యయం ప్రజలపై భారంగా మారడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన కాలయాపనే కారణమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెట్రో పనులు చేస్తే రక్తం ఏరులై పారుతుందని గతంలో కేసీఆర్ బెదిరించారని, సీఎం అయిన తర్వాత ఆయన చేసిన కాలయాపనతోనే ధరలు పెరిగాయని విమర్శించారు.
దీనివల్ల ప్రాజెక్టు భారం అదనంగా రూ.3,500 కోట్లు ప్రజలపై పడిందని తెలిపారు. ఈ అదనపు భారానికి కారణమైన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో ధరలు గరిష్టంగా రూ.19 ఉండగా ఇప్పుడు రూ.60 పెంచారని పేర్కొన్నారు. ఈ అదనపు ధరలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మెట్రో పనులను మొదలు పెట్టిందని గుర్తు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైలు వంటివన్నీ కాంగ్రెస్సే ప్రారంభించిందన్నారు. మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య భవిష్యత్ రాజకీయ పొత్తులకు వేదికగా ఈ ప్రారంభ కార్యక్రమం జరిగిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ కేసీఆర్ దగ్గర వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment