మెట్రో ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం | Metro administrators meets cm kcr | Sakshi
Sakshi News home page

మెట్రో ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం

Published Fri, Jun 5 2015 3:39 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

Metro administrators meets cm kcr

మెట్రో నిర్వాహకులకు సీఎం సూచన
* ముఖ్యమంత్రితో కియోలిన్ సీఈఓ బెర్నార్డ్ భేటీ

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు, ప్రత్యేకించి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెట్రో నిర్వాహకులకు సూచించారు. మెట్రో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఫ్రెంచి కంపెనీ కియోలిస్ సీఈఓ బెర్నార్డ్ టబరీ గురువారం సీఎంతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.

స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలను సందర్శించి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా మెయింటెనెన్స్ ఇంజనీర్లను ఎంపిక చేస్తామని బెర్నార్డ్   సీఎంకు హామీ ఇచ్చారు. అవకాశమున్న చోట మహిళలకు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. తగిన భద్రతతోపాటు నిరక్షరాస్యులు కూడా మెట్రో రైలు సేవలను వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించాలని సీఎం సూచించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు సౌకర్యవంతంగా మెట్రో సేవలు ఉండాలన్నారు.

ప్యారిస్, లండన్, వాషింగ్టన్, బోస్టన్, మెల్‌బోర్న్ తదితర ప్రపంచ ప్రసిద్ధ పట్టణాల్లో ప్రజా రవాణా, మెట్రో, లైట్ రైలు వ్యవస్థల నిర్వహణలో తమకున్న అనుభవాన్ని బెర్నార్డ్ టబరీ ముఖ్యమంత్రికి వివరించారు. రైలు, బస్సు, మెట్రో వ్యవస్థలను అనుసంధానిస్తూ నగరంలో ప్రయాణాన్ని సులభతరం చేయడం మెట్రో ప్రాజెక్టు ప్రత్యేకతగా అభివర్ణించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చూపుతున్న చొరవను బెర్నార్డ్ కొనియాడారు. సమావేశంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
సీఎంతో రుజా గ్రూప్ చైర్మన్ భేటీ
రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు రుజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆసక్తి వ్యక్తం చేసింది. కంపెనీ చైర్మన్ పవన్ కుమార్ రుజా, డైరక్టర్ కిరణ్ తదితరులు గురువారం సీఎంతో భేటీ అయ్యారు. యూరప్ బయట ఆధునిక రైల్వే కోచ్‌ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు రుజా వెల్లడించారు. హైదరాబాద్ పరిసరాల్లో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. రుజా గ్రూప్ ప్రయత్నాలకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. రుజా గ్రూప్ ప్రణాళికలకు అవసరమైన ఏర్పాట్లపై చర్చిం చాల్సిందిగాఅధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement