మెట్రో’ ముహూర్తం..నవంబర్ 28
► మెట్రో రైలును ప్రారంభించాలని ఆహ్వానిస్తూ ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ
► తొలివిడతగా నాగోల్–అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్–మియాపూర్ మార్గాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానిని ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం లేఖ రాశారు.
ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సదస్సు జరగనుంది. ప్రధాని అందులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. దీంతో ఇదే సందర్భంలో ప్రధాని చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా నాగోల్–అమీర్‌పేట (17 కిలోమీటర్లు), మియాపూర్–ఎస్‌ఆర్ నగర్ (13 కిలోమీటర్లు) మార్గాలను ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం రెండు కారిడార్లలో..
మెట్రో కారిడార్లలో తొలివిడతగా నాగోల్–అమీర్‌పేట (17 కిలోమీటర్లు), మియాపూర్–ఎస్‌ఆర్ నగర్ (13 కిలోమీటర్లు) మధ్య పనులన్నీ పూర్తయ్యాయి. రైలుమార్గం, స్టేషన్ల నిర్మాణం, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ విజయవంతమైంది. భద్రతాపరమైన అనుమతులు కూడా వచ్చాయి. మొత్తం 24 స్టేషన్లు ఉన్న ఈ మార్గాలను నవంబర్‌లో ప్రారంభించనున్నారు.
మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు తమ సొంత వాహనాలను నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ స్థలాల ఎంపిక కూడా పూర్తయినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలి విడత ప్రారంభం కానున్న మార్గాల్లోని మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, ముఖ్య ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులను నడపనుందని వెల్లడించారు.
రూ.15,000కోట్లు
హైదరాబాద్‌లో మొత్తం మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టారు. సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎల్బీనగర్–మియాపూర్ (28.3 కిలోమీటర్లు), జేబీఎస్–ఎంజీబీఎస్–ఫలక్‌నుమా (16 కి.మీ.), నాగోల్–రాయదుర్గం (27.7 కి.మీ.) కారిడార్లు ఉన్నాయి అయితే ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మధ్య 5.5 కిలోమీటర్ల పనులను ప్రభుత్వం ఖరారు చేయలేదు.
మిగతా 66.5 కిలోమీటర్ల మార్గంలో 64 కిలోమీటర్ల మేర పునాదులు, పిల్లర్లు సిద్ధమయ్యాయి. అందులో 57 కిలోమీటర్ల మార్గంలో పిల్లర్లపై మెట్రో పట్టాలు వేసేందుకు వీలుగా వయడక్ట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేశారు. విద్యుదీకరణ పనులు సైతం జరుగుతున్నాయి. మొత్తంగా మెట్రో పనుల్లో 95 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం ప్రాజెక్టును 2018 డిసెంబరులోగా పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ గతంలో ప్రభుత్వానికి హామీ ఇచ్చింది కూడా.