ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే స్వైన్ఫ్లూ: పొన్నాల
హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో స్వైన్ఫ్లూ ప్రబలిందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీ భవన్లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవానికి హాజరైన పొన్నాల పైవిధంగా స్పందించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారు పాలనతో దేశంలో రాజ్యంగా స్ఫూర్తి, లౌకికవాదం పూర్తిగా దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు.
ఇక రాష్ట్రం విషయానికొస్తే టీఆర్ఎస్ పాలన కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టేలా ఉందంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రయోజనాలను విస్మరిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాకే పెద్దపీట వేస్తూ ఆందోళన తెలంగాణగా మార్చిందని ఆయన మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా స్వైన్ఫ్లూ సాకుతో దళిత మంత్రిని బలిపశువును చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని స్వైన్ఫ్లూ ని అరికట్టగలిగిందని పొన్నాల సమర్థించుకున్నారు.