కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడుతోన్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
వరంగల్: శాసనసభలో జరిగిన గోరంత గొడవను కొండతగా చూపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరు సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయడం రాష్ట్రంలో నిరంకుశ పాలనకు నిదర్శనమని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండలోని రాంనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల వలయంలో విలేకరుల సమావేశం నిర్వహించే దుస్థితి టీఆర్‌ఎస్ పాలనలో ఉండడం దౌర్భాగ్యమన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత భయం దేనికన్నారు. కేసీఆర్ ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ఈ వ్యూహాన్ని రచించారన్నారు. గవర్నర్ ప్రసంగం సభలో కౌన్సిల్ చైర్మన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే ఇది జరిగిందన్నారు. సభ్యులందరికి థర్డ్ పార్టీతో మెడికల్ టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 18రోజుల పాటు చర్చలు జరిపామని, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాల ముందు ఫైళ్లు పెట్టామన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, 34శాతం ప్రజల మద్దతు మాత్రమే టీఆర్‌ఎస్‌కు ఉందన్నారు.
66 శాతం ప్రజల మద్దతు లేదన్నారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా, దళితులపై నేరేళ్లలో పోలీసుల దాడికి చర్యలు లేవన్నారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. ఉరిశిక్ష వేసిన ఖైదీని సైతం చివరి క్షణంలో అఖరి కోరిక ఏమిటని అడుగుతారని, సభ్యులను సస్పెండ్ చేసే ముందు కనీసం ఇతర ప్రతిపక్ష సభ్యులను సంప్రదించకుండానే ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి నియంత పాలకులు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయారో సాక్ష్యాలు ఉన్నాయన్నారు.
టీఆర్‌ఎస్ నేతల సొంత లాభం కోసం మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు ప్రారంభించారన్నారు. వీటిపై ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉండడంతోనే సభ్యులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరైన వారికి రాజ్యసభ అవకాశం ఇచ్చారని, ఈవిషయంలో సొంత పార్టీలోని వారే బహిరంగ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగా యని గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సహనంతో పనిచేశాయని.. నియంత, అహంకార నేతలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ సభ్యులు నమిండ్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీను, సంపత్‌యాదవ్, నాయిని లక్ష్మారెడ్డితదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment