మాది బీద సర్కార్!
- సీసీ కెమెరాలకు రూ.36 కోట్లు ఖర్చుపెట్టలేం
- హైకోర్టులో ఏపీ ప్రభుత్వ వాదన
సాక్షి, హైదరాబాద్: ‘‘మాది బీద ప్రభుత్వం. రూ. 36 కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో మేం లేం.’’ ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యాఖ్య ఇది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్‌ను అడ్డుకోవడానికిగాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది ఈ వ్యాఖ్య చేశారు. పదవ తరగతి పరీక్షల్లో చూచిరాతలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీఈ (కంటిన్యూస్, కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్) విధానాన్ని తీసుకొచ్చామని న్యాయవాది తెలిపారు. ఆ విధానం గురించి వివరించే ప్రయత్నం చేశారు. అయితే హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఆ విధానం అర్థం కాకుండా ఉందని, దాని వల్ల చూచిరాతలను పూర్తిగా రూపుమాపడం సాధ్యం కాదని తెలిపింది.
సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. తమది బీద ప్రభుత్వమని, తాము రూ.36 కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో లేమని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అసలు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎంతని ప్రశ్నించింది. న్యాయవాది బదులు ఇవ్వలేకపోవడంతో కోర్టులోనే ఉన్న అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ప్రశ్నించింది. తమది లోటు బడ్జెట్ అని, కోర్టు ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రూ.36 కోట్లు స్వల్ప మొత్తమని, సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ఈ ఖర్చు చేయాల్సిందేనని, ఇది ఎంత మాత్రం వృథా కాబోదని ధర్మాసనం తెలిపింది. సీసీ కెమెరాలు ఖర్చు అనుకుంటే మరో ప్రత్యామ్నాయం సూచించాలంది.
మాస్‌కాపీయింగ్ లేదు: మాస్ కాపీయింగ్ ఏపీలో జరిగిందని, తెలంగాణలో మాస్ కాపీయింగ్ లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, అన్ని కేంద్రాల్లో ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిం చింది. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.36 కోట్ల వ్యయం అవుతుందని న్యాయవాది వివరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ ..ఫీజు రీయింబర్స్ కోసం ప్రభుత్వం 3600 కోట్లు ఖర్చు చేస్తోందని, దీంతో పోలిస్తే సీసీ కెమెరాల ఏర్పాటు వ్యయం తక్కువన్నారు.
మొన్నటి పరీక్షల సందర్భంగా కొన్ని చోట్ల తెలంగాణ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, ఓ కేంద్రంలో ఐదేళ్లుగా 100% ఫలితాలు వస్తుండగా, సీసీ కెమెరాల ఏర్పాటు తరువాత ఫలితాలు 47 శాతానికి పడిపోయాయని వివరించారు. దీనిపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విద్యార్థులు సీసీ కెమెరాలను చూసి భయపడటం వల్లే ఫలితాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే: హైకోర్టు
వచ్చే ఏడాది పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రారంభానికి ముందే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని, ఈ విషయంలో మినహాయింపు కోరవద్దని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.