Poor land
-
పేదల భూముల వ్యవహారం.. ఆర్ఎఫ్సీకి అల్టిమేటం జారీ
రంగారెడ్డి, సాక్షి: పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యానికి అల్టిమేటం జారీ అయ్యింది. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆర్ఎఫ్సీ యాజమాన్యం తమ గుప్పిటే ఉంచుకుంది. అయితే.. తమ భూములు తమకు ఇవ్వకపోతే ఫిల్మ్ సిటీని ముస్తామని పేద లబ్ధిదారులు హెచ్చరించారు. తాజాగా.. సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు రంగారెడ్డి కలెక్టరేట్(Rangareddy Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంతో.. నేడు చర్చల కోసం ఇరు వర్గాలను ఆర్డీవో ఆహ్వానించారు. అయితే.. చర్చలకు రాకుండా ఆర్ఎఫ్సీ యాజమాన్యం డుమ్మా కొట్టింది. ఈ పరిణామంతో బాధితులు మరోసారి ఆందోళకు దిగారు.ఈ పరిణామాన్ని ఆర్డీవో తీవ్రంగా పరిగణించారు. గురువారం చర్చలకు ఖచ్చితంగా రావాల్సిందేనంటూ ఆర్ఎఫ్సీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారాయన. మరోవైపు.. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని RFC యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని, ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా సాగదీస్తోందని బాధితులు వాపోతున్నారు. రేపు చర్చల్లో పాల్గొని తమ స్థలాలను చూపించకపోతే గనుక.. రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామన్న సీపీఎం(CPM) నేతలు, లబ్ది దారులు హెచ్చరికలు జారీ చేశారు. -
పేదల భూములు లాక్కుంటే సహించేది లేదు
రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.రాజిరెడ్డి మెదక్: రెవెన్యూ అధికారులు పేదల భూములు లాక్కొని వారిని రోడ్డుపాలు చేస్తే చూస్తు ఊరుకోమని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు అకిరెడ్డి రాజిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారం శివారులో సర్వే నం.261లో మొత్తం 588 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేదన్నారు. అందులో అదే గ్రామానికి చెందిన ఓ భూస్వామికి 365 ఎకరాలు ఉండగా, మిగతా 223 ఎకరాల ప్రభుత్వ గైరాన్ భూమిని 1984నుంచి 5యేళ్లపాటు అప్పటి ఎమ్మెల్యే విఠల్రెడ్డి 108మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద లబ్ధిదారులకు మూడు విడతల్లో పట్టాలు చేసి ఇచ్చారన్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా ఆ భూమిని నిరుపేదలైన ఎస్సీ,ఎస్టీ, బీసీలు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. 2001 నుంచి నిరుపేదలకు సంబంధించిన ఈ భూములను రెవెన్యూ అధికారులు ఎక్స్ సర్వీస్మెన్లకు పట్టాలు చేసి ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
భూ బకాసురులపై సుమోటో కేసు నమోదు చేయాలి
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు రూరల్: పేదల భూములను ఆక్రమించుకుంటున్న భూ బకాసురులపై సుమోటో కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఎన్టీ రామారావు, ఇందిరా గాంధీలు పేద ప్రజలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని బలవంతులైన అధికారపార్టీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని రాజంపేట ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. అయినప్పటికీ భూముల ఆక్రమణ ఆగలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నింటికీ ఆధార్ లింక్ చేసినట్లే డీకేటీ భూములకు కూడా లింక్ చేయాలన్నారు. ఈ భూముల ఆక్రమణపై కలెక్టర్, అసెంబ్లీ సీఎస్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఓబులవారిపల్లె మండలం గాదెలకు చెందిన మాజీ సర్పంచ్ రామక్రిష్ణయ్యకు చెందిన రిజిస్ట్రేషన్ భూమిని కూడా అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ అక్రమాలపై డిసెంబరు 5వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ క్షత్రియ నాయకుడు ముప్పాల హేమనవర్మ, జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, మాజీ జెడ్పీటీసీ బండారు సుభద్రమ్మ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆర్వీ రమణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.