ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
రైల్వేకోడూరు రూరల్: పేదల భూములను ఆక్రమించుకుంటున్న భూ బకాసురులపై సుమోటో కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీ రామారావు, ఇందిరా గాంధీలు పేద ప్రజలకు అసైన్‌మెంట్ కమిటీ ద్వారా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని బలవంతులైన అధికారపార్టీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని చెప్పారు.
ఈ విషయాన్ని రాజంపేట ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. అయినప్పటికీ భూముల ఆక్రమణ ఆగలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నింటికీ ఆధార్ లింక్ చేసినట్లే డీకేటీ భూములకు కూడా లింక్ చేయాలన్నారు. ఈ భూముల ఆక్రమణపై కలెక్టర్, అసెంబ్లీ సీఎస్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఓబులవారిపల్లె మండలం గాదెలకు చెందిన మాజీ సర్పంచ్ రామక్రిష్ణయ్యకు చెందిన రిజిస్ట్రేషన్ భూమిని కూడా అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని తెలిపారు.
ఈ అక్రమాలపై డిసెంబరు 5వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ క్షత్రియ నాయకుడు ముప్పాల హేమనవర్మ, జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, మాజీ జెడ్పీటీసీ బండారు సుభద్రమ్మ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆర్వీ రమణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
భూ బకాసురులపై సుమోటో కేసు నమోదు చేయాలి
Published Thu, Nov 27 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement