క్వార్టర్స్‌లో ఓడిన సానియా జోడి
మాడ్రిడ్: డబ్ల్యూటీఏ మాడ్రిడ్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, కారా బ్లాక్ (జింబాబ్వే) పోరాటం క్వార్టర్ఫైనల్లో ముగిసింది. ఇటీవల పోర్చుగల్ ఓపెన్‌ను గెలుచుకున్న ఈ జోడి 7-5, 1-6, 8-10 తేడాతో తైపీస్ చైనీస్ జంట సు వీ సే, షువా పెంగ్ చేతిలో ఓడింది. గంటా 30 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా, బ్లాక్ తొలి సెట్‌ను గెలుచుకున్నా రెండో సెట్లో చేతులెత్తేసింది.
ఆఖరి సెట్లో పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగినా సూపర్ టైబ్రేక్‌లో ప్రత్యర్థి ఆధిక్యం సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న, ఐజమ్ ఉల్ ఖురేషి (పాక్) జోడికి తొలి రౌండ్లో బై లభించింది. వీరు ప్రిక్వార్టర్స్‌లో ఆండ్రియాస్ సెప్పీ (ఇటలీ), మిలాస్ రవోనిక్ (కెనడా)తో తలపడతారు.