TS: గ్రూప్–2 వాయిదాకే ఛాన్స్!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–2 అర్హత పరీక్షలపై అభ్యర్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ ఈ పరీక్షలు ఈసారైనా జరుగుతాయో లేదోనని అభ్యర్థులు కలవరపడుతున్నారు. గ్రూప్–2 అర్హత పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రెండు నెలల క్రితమే ప్రకటించింది.
వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ 2–3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తేదీలు ప్రకటించినప్పటికీ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థుల నుంచి ఒత్తిడి రావడంతోపాటు ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో 2024 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది.
ఈ లెక్కన మరో 10 రోజుల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం టీఎస్పీఎస్సీకి మరో సమస్య ఎదురైంది. టీఎస్సీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డితోపాటు ఐదుగురు సభ్యులు గవర్నర్‌ను కలసి రాజీనామాలు సమర్పించాలనుకున్నా ఆమె సమయం ఇవ్వకపోవడంతో గవర్నర్ కార్యాలయానికి రాజీనామా లేఖలు పంపారు.
అయితే రాజీనామాలు పంపి వారం దాటినా గవర్నర్ కార్యాలయం నుంచి వాటిని ఆమోదిస్తున్నట్లుగానీ.. తిరస్కరిస్తున్నట్లుగానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సమాచారం. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే తప్ప కొత్తగా చైర్మన్‌ను, సభ్యులను నియమించే అవకాశం లేదని అంటున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వారి రాజీనామాలతో సంబంధం లేకుండా అప్పటికే ఖాళీగా ఉన్న మరో ఐదుగురు సభ్యులను నియమించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కొత్త చైర్మన్, సభ్యులు వచ్చాకే పరీక్షలు?
ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం పాలనా వ్యవహారాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. పరీక్షల నిర్వహణ, నియామకాలకు సంబంధించిన అంశాల్లో చైర్మన్, సభ్యుల నిర్ణయమే కీలకపాత్ర పోషించనుంది. దీంతో జనవరిలో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కష్టమేనని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటై మరోమారు తేదీలు ప్రకటించే వరకు అభ్యర్థులు పరీక్షల సన్నద్ధతను కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గతేడాది డిసెంబర్లో వెలువడిన నోటిఫికేషన్...
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు నెలపాటు అవకాశం కల్పించింది. దీంతో 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్–2 అర్హత పరీక్షలను ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పలు పరీక్షలను కమిషన్ రీషెడ్యూల్ చేసింది. దీంతో గ్రూప్–2 పరీక్షలు నవంబర్‌కు వాయిదా పడగా... అభ్యర్థుల ఒత్తిడి, ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రెండోసారి జనవరికి వాయిదా పడ్డాయి.