హ్యారీపోటర్‌తో ట్రంప్‌గారికి చిక్కులే!
వాషింగ్టన్: ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతం సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. మాయామంత్రాలతో పిల్లల కోసం రాసిన ఈ అద్భుత నవలలు ప్రపంచవ్యాప్తంగా 45.5 కోట్ల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. హ్యారీ పోటర్ నవలలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఓ ఆసక్తికరమైన లింక్ ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
సాధారణంగా హ్యారీపోటర్ నవలలు సహనాన్ని, భిన్నత్వాన్ని, ఐక్యతను ప్రబోధిస్తాయి. కాబట్టి ఈ నవలల్ని చదవిన అమెరికన్లు ట్రంప్ గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చునని ఓ అధ్యయనం తెలిపింది. హ్యారీ పోటర్ నవలలు చదివిన అమెరికన్లకు రిపబిక్లన్ అభ్యర్థి ట్రంప్ నచ్చకపోవచ్చునని వెల్లడించింది. హ్యారీ పోటర్ ప్రబోధించిన భావజాలాలకు విరుద్ధంగా ట్రంప్ అభిప్రాయాలు ఉండటం, అతని ప్రబోధాలన్నీ హ్యారీపోటర్ శత్రువు లార్డ్ వోల్డేమార్ట్ను పోలి ఉండటం ఇందుకు కారణమని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డయనా ముట్జ్ తెలిపారు.
హ్యారీ పోటర్ నవలలను అమెరికన్లు ఎంత ఎక్కువగా చదివితే.. ట్రంప్‌పై అంత వ్యతిరేక ప్రభావం ఎన్నికల్లో పడే అవకాశముందని పేర్కొన్నారు. హ్యారీ పోటర్ సిరీస్ ప్రబోధించిన విలువలకు విరుద్ధంగా ట్రంప్ రాజకీయ అభిప్రాయాలు ఉండటమే ఇందుకు కారణమని డయానా చెప్పారు. అమెరికాలోకి ముస్లిం రాకను నిషేధిస్తా.. వలసదారులు రాకుండా దేశ సరిహద్దుల్లో గోడలు కడుతా అంటూ విచ్ఛిన్నకరమైన రాజకీయ అభిప్రాయాలను ట్రంప్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.