poultry sector companies
-
వ్యవసాయ, అనుబంధ రంగాలపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా పౌల్ట్రీ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత మత్స్య రంగంపై ప్రభావం పడింది. దేశంలో కోవిడ్–19 లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై పడిన ప్రభావంపై నాబార్డు సర్వే నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల ఉత్పాదకత తగ్గడమే కాకుండా లాక్ డౌన్ సమయంలో ఉత్పత్తుల ధరలు తగ్గిపోయినట్లు సర్వే పేర్కొంది. దేశంలో 54 శాతం జిల్లాల్లో ధరలు తగ్గిపోగా 23 శాతం జిల్లాల్లో ధరలు యధాతథంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. లాక్డౌన్లో మార్కెట్లతో పాటు ప్రధాన ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు చెందిన రంగాలు మూత పడటంతో పాటు రవాణా నిలిచిపోవడం వల్ల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో ధరలు పడిపోయినట్లు నివేదికలో పేర్కొంది. ఏప్రిల్‌లో నెలలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు తేలింది. జంతు ఉత్పత్తులను వినియోగిస్తే కరోనా వైరస్ సోకుతుందనే ప్రచారంతో పౌల్ట్రీ రంగం ఉత్పత్తుల వినియోగం భారీగా పడిపోయిందని సర్వే వెల్లడించింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. ► మత్స్య, మేకలు, గొర్రెల ఉత్పత్తుల వినియోగం భారీగా పడిపోవడంతో ఈ రంగాల ఉత్పాదకత భారీగా తగ్గిపోయింది. పాల డిమాండ్‌పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ, డెయిరీ ఇతర ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగానే ఉంది. ► హోటల్స్, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, పార్లర్లు మూత పడటం, వీధి వ్యాపారాలు నడవక పోవడం వల్ల స్వీట్లు, పన్నీరు, క్రీమ్ ఉత్పత్తుల డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో పాడి రైతుల పాలకు సరైన ధర లభించలేదు. పర్యవసానంగా పాడి రైతులు తమ పశువులకు గ్రీన్, డ్రై దాణాను ఇవ్వడం తగ్గిచేశారు. తద్వారా పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ► ఒక్క ఏప్రిల్ నెలలోనే డెయిరీ ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగా పడింది. అయితే ఏప్రిల్ నాటికే రబీ పంటలు వచ్చేయడంతో వ్యవసాయ ఉత్పత్తులపై లాక్ డౌన్ ప్రభావం తక్కువగానే ఉంది. -
పౌల్ట్రీ అభివృద్ధికి ఉత్తమ పాలసీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పౌల్ట్రీ రంగానికి మరింత లబ్ధి చేకూర్చేలా దేశంలోనే ఉత్తమ పాలసీని తయారు చేస్తామని, దీనిపై అధ్యయనం చేసి త్వరలోనే నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం తలసాని అధ్యక్షతన శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి సబ్‌కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్, వి.శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు ఉన్నతాధికారులు, కోళ్ల పెంపకం దారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పోటీ మార్కెట్లో పౌల్ట్రీ రంగం నిలదొక్కుకునే విధంగా ప్రభుత్వం అందించదగిన సహాయ సహకారాలపై అధ్యయనం చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలను కూడా పరిశీలిస్తామని చెప్పారు. -
యాంటీ బయాటిక్స్ లేవు
కోళ్ల బరువు పెంచడానికి యాంటీ బయాటిక్స్, హార్మోన్లు ఇస్తున్నారనడం అవాస్తవం పౌల్ట్రీ రంగ సంస్థలు, నిపుణుల స్పందన సాక్షి ఆదివారం ‘ఫోకస్’ పేజీలో ‘గుడ్డు మందా.. కోడి మందా’ అనే శీర్షికతో ఇచ్చిన కథనంపై పలు సంస్థలు స్పందించాయి. ఈ సందర్భంగా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘కోళ్ల బరువు పెంచడం కోసం హార్మోన్లు, యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారన్న విషయంలో నిజం లేదు. కేవలం మన దగ్గరున్న నాణ్యమైన బ్రీడ్ కారణంగానే కోళ్ల ఎదుగుదల బాగుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కోంటోంది. ఒకవైపు గుడ్లకు సరైన ధర లేదు. మరోవైపు దాణా రేట్లు బాగా పెరిగాయి. బ్రాయిలర్ అయినా, లేయర్ కోళ్లయినా వాటికి కడుపు నిండా దాణా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న మన రెండు రాష్ట్రాల రైతులు కోళ్ల పెంపకంలో రసాయనాలు వాడుతున్నారనడం అవాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో రైతులు నెలకు 3 కోట్ల బ్రాయిలర్ కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పౌల్ట్రీని నమ్ముకుని బతుకుతున్నారు. మన దగ్గర కోళ్లలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఉన్నాయంటూ కిందటేడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్లు ఢిల్లీలో చేసిన పరిశోధనను కూడా మేం ఖండించాం. ఆ రిపోర్టులో ఉన్న అవశేషాల స్థాయి యూరోపియన్ ప్రమాణాలకు లోబడే ఉన్నట్టు అప్పుడే మేం స్పష్టం చేశాం కూడా. కోళ్లకు బొటాక్స్ వాడుతున్నారన్న విషయంలో కూడా నిజం లేదు. అంతేకాదు ఈ నలభై రోజుల కాలంలో నాలుగు కిలోల ఆహారం తీసుకునే మన కోడిని ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల వరకూ ఎప్పుడైనా తినొచ్చు..’’ అని చెప్పారు. సరైన ధరే లేదు.. - కె.జి.ఆనంద్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) సీఈవో రెండు తెలుగు రాష్ట్రాల్లో లేయర్ కోళ్ల రైతులు 5,000 మంది వరకు ఉన్నారు. ఏడాదికి పదివేల కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. కోళ్ల దాణాగా ఉపయోగించే మొక్కజొన్న కనీస మద్దతు ధరను గత ఐదేళ్లుగా ప్రభుత్వం పెంచుతూ పోవడంతో.. ఆ ప్రభావం పడి గుడ్ల ధర విషయంలో రైతులు చాలా నష్టపోవాల్సి వస్తోంది. గుడ్ల ఉత్పత్తికి రసాయన పదార్థాలను ఆశ్రయిస్తున్నారనే విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ధరల కారణంగా మన రైతులకు కోడికి కడుపునిండా దాణా పెట్టే పరిస్థితే లేదు. అలాంటిది యాంటీ బయాటిక్స్ వాడి గుడ్ల ఉత్పత్తిని పెంచుతున్నారనే వార్తల్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు మన దగ్గర మోల్టింగ్ పద్ధతిని కూడా కేవలం 20శాతం మంది రైతులు పాటిస్తున్నారు. రైతు క్షేమం - ఎస్.బాలసుబ్రమణ్యన్, ఆలిండియా డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వెంకాబ్ చికెన్) ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీల వల్ల రైతులు నష్టపోతున్నారనే విషయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 శాతం ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ ఉండడమే దీనికి కారణం. మరో 35 శాతం సొంతంగా పెట్టుబడులు పెట్టి పౌల్ట్రీఫామ్లను నడిపిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ కారణంగా బహుళజాతి కంపెనీల పెత్తనం పెరిగిపోతుందన్న విషయం పక్కనపెడితే.. పౌల్ట్రీని నమ్ముకుని బతుకుతున్న తెలుగు రైతులు సురక్షితంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి. ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీలో రైతులకు పెట్టుబడి రిస్క్ ఉండదు. రెండు నెలలు తిరగకుండానే లాభాల్ని ఆర్జించవచ్చు. అలాగే ఇంటిగ్రేటెడ్ సంస్థలు కోట్ల సొమ్ము ఆర్జిస్తున్నాయన్న విషయం కూడా అవాస్తవం. రైతులకు వచ్చే లాభం కంటే కంపెనీలకు తక్కువగా వస్తుంది.