సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా పౌల్ట్రీ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత మత్స్య రంగంపై ప్రభావం పడింది. దేశంలో కోవిడ్–19 లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై పడిన ప్రభావంపై నాబార్డు సర్వే నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల ఉత్పాదకత తగ్గడమే కాకుండా లాక్ డౌన్ సమయంలో ఉత్పత్తుల ధరలు తగ్గిపోయినట్లు సర్వే పేర్కొంది. దేశంలో 54 శాతం జిల్లాల్లో ధరలు తగ్గిపోగా 23 శాతం జిల్లాల్లో ధరలు యధాతథంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. లాక్‌డౌన్‌లో మార్కెట్లతో పాటు ప్రధాన ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు చెందిన రంగాలు మూత పడటంతో పాటు రవాణా నిలిచిపోవడం వల్ల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో ధరలు పడిపోయినట్లు నివేదికలో పేర్కొంది. ఏప్రిల్‌లో నెలలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు తేలింది. జంతు ఉత్పత్తులను వినియోగిస్తే కరోనా వైరస్ సోకుతుందనే ప్రచారంతో పౌల్ట్రీ రంగం ఉత్పత్తుల వినియోగం భారీగా పడిపోయిందని సర్వే వెల్లడించింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..
► మత్స్య, మేకలు, గొర్రెల ఉత్పత్తుల వినియోగం భారీగా పడిపోవడంతో ఈ రంగాల ఉత్పాదకత భారీగా తగ్గిపోయింది. పాల డిమాండ్‌పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ, డెయిరీ ఇతర ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగానే ఉంది.
► హోటల్స్, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, పార్లర్లు మూత పడటం, వీధి వ్యాపారాలు నడవక పోవడం వల్ల స్వీట్లు, పన్నీరు, క్రీమ్ ఉత్పత్తుల డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో పాడి రైతుల పాలకు సరైన ధర లభించలేదు. పర్యవసానంగా పాడి రైతులు తమ పశువులకు గ్రీన్, డ్రై దాణాను ఇవ్వడం తగ్గిచేశారు. తద్వారా పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది.
► ఒక్క ఏప్రిల్ నెలలోనే డెయిరీ ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగా పడింది. అయితే ఏప్రిల్ నాటికే రబీ పంటలు వచ్చేయడంతో వ్యవసాయ ఉత్పత్తులపై లాక్ డౌన్ ప్రభావం తక్కువగానే ఉంది.
వ్యవసాయ, అనుబంధ రంగాలపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం
Published Sun, Dec 6 2020 4:54 AM | Last Updated on Sun, Dec 6 2020 4:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment