the power cuts
-
‘చితి’కిన రైతు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 3.90 లక్షల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకునే జీవిస్తున్నారు. గత ఏడాది అతివృష్టి, వడగళ్ల వానాలతో పంటలు తీవ్రంగా నష్టపోయారు. కొత్త రుణాలు, పంట నష్టపరిహారం అందకపోవడంతో వడ్డీ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించి పంటలు వేసుకున్నారు. కరెంటు కోతలతో కళ్ల ముదే ఎండిపోతున్న పంటలను చూడలేక.. పెట్టిన పెట్టుబడి అప్పు తీర్చలేక ఆందోళనతో ఇప్పటి వరకు 52 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు లేక జిల్లాలో సాధారణ స్థాయిలో పంట భూములు సాగు చేసుకోలేదు. 6.50 లక్షల హెక్టార్లలో సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళిక రుపొందించారు. తగ్గిన వర్షాభావ పరిస్థితుల కారణంగా 5.47 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేసుకున్నారు. ఆశించిన వర్షాలు లేక విత్తుకున్న పంటలు భూమిలో మొలకెత్తక మురిగి పోయి.. రెండుమూడు సార్లు వేసుకున్నారు. దీంతో రైతులకు ఆర్థిక భారం అధికమైంది. సెప్టెంబర్ మొదటివారంలో కురిసిన వర్షాలు తప్ప చెప్పుకోదగ్గ వర్షాలు కురువలేదు. దీంతో వరి సాగు 60వేల హెక్టార్లలో సాగు కావాల్సిన వరి సాగు అత్యల్పంగా 18వేల హెక్టార్లకే పరిమితమైంది. రిజర్వయర్లు, చెరువుల్లోని నీరు పంటకు నీరు అందించ లేక ఎండిపోతున్నయి. పత్తి, సోయా, కంది పంటల పరిస్థితీ ఇదే విధంగా ఉంది. తగ్గిన వర్షపాతం గత ఏడాది ఇదే సమయానికి 1,082 మిల్లీమీటర్ల వర్షపాతం.. సాధారణ వర్షాపాతం కంటే అధికంగా కురిసిం ది. ఈసారి ఇప్పటివరకు730 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 31శాతం మేరకు తక్కువగా నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. జలాశయాల కింద పంట సాగు చేసుకునేందుకు రైతులు వెనకడుగు వేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్సీ) జలాశయంలో వరదనీరు రాలేదు. మిగితా జలాశయల పరిస్థితి అదేవిధంగా ఉంది. జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగుచేసిన పంటలకు నీరందక దిగుబడి భారీగా పడిపోయింది. ఇప్పడున్న ప్రాజెక్టుల నీటితో రబీ సాగుకు నీరు అందించడం సాధ్యం కాదని అధికారులే పేర్కొంటున్నారు. జిల్లాలో రబీ సాగు అయ్యేది వరి పంట అధికంగా అవుతుంది. నెలకొన్న పరిస్తితుల దృష్ట్యా వ్యవసాయ అధికారులు ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమమని రైతులకు సూచిస్తున్నారు. జిల్లాలో 52 మండలాలకు గాను కేవలం సిర్పూర్ మండలంలో సాధారణ వర్షపాతం నమోదైంది. 11 మండ లాల్లో 70 నుంచి 80 శాతం వరకు పడింది మిగితా 40 మండలాల్లో 40 నుంచి 60 శాతం లోటు వర్షాపాతం నమోదైంది. ఈ మండలాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయి. వవ్యసాయ అధికారులు కరువు మండలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అందని రుణాలు గతంలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. రుణ మాఫీకై ప్రభుత్వం నెలల తరబడి కాలయపాన చేస్తూ 25 శాతం ప్రకటించింది. కొత్త రుణాలు అందుతాయని బ్యాంకుల చూట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.22.80 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణంయించారు. కానీ ఇప్పటి వరకు సగం కూడా ఇవ్వలేదు. బ్యాంకు అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రూ.820 కోట్లు రుణాలు ఇచ్చామని చెబుతున్నా జిల్లాలో ఎక్కడ రీషెడ్యూల్ చేయలేదని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ కింద ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రూ. 3.64 కోట్లను రైతుల పాత రుణాలకు వడ్డీ కింద కట్ చేసుకుని మిగతాది రైతులకు చెల్లిస్తున్నారు. వడ్డీ వ్యాపారులే దిక్కు సాగు గడువు దాటిపోతుందని రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. కొంతమంది వడ్డీ వ్యాపారులు రైతుల పట్టాపాసుబుక్ దగ్గర పెట్టుకొని, ఒప్పంద పత్రాలు రాయించుకుని 20శాతం వడ్డీ చొప్పున అప్పు అందజేశారు. ఈ రకంగా ఈ ఖరీఫ్‌లో జిల్లాలో రూ.400 కోట్ల వరకు వ్యాపారులు వడ్డీపై డబ్బులను రైతులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కరెంటు కష్టాలు బోరుబావుల నీరును పంటకు అందించి దిగుబడి సాధించాలనుకున్న రైతులకు కరెంట్ కోతలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఏడు గంటలు కరెంట్‌ను ఐదు గంటలకు కుదించారు. ఇప్పడు కేటాయించిన సమయంలోనైనా రెండు గంటలైనా సరఫరా చేయకపోవడంతో పంటలకు నీరందక పూత, కాత దశలోనే ఎండిపోతున్నాయి. సగానికి తగ్గిన దిగుబడి వర్షాభావ పరిస్థితులు, పూత, కాత దశలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల నేలలో తేమ తగ్గి ఎండి పోవడం, చీడపీడల ఉధృతి అధికం కావడంతో పంట దిగుబడి పడిపోయింది. హెక్టార్‌కు 25క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాల్సింది ఉండగా వర్షాభావ, చీడపీడల కారణంగా హెక్టార్‌కు 10 నుంచి 15 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోంది. సోయా పంట దిగుబడి మరింత తగ్గుతోంది. హెక్టార్‌కు 4 నుంచి 5 క్వింటాళ్లు రావడం గగనంగా మారుతోంది. వరి పంట ఆలస్యంగా నాటు వేసిన కారణంగా పొట్టదశలో ఉన్న పంటకు నీరు అందించలేక ఎండిపోతున్నాయి. సోయా, వరి పంట కోత, నూర్పిడి ఖర్చు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రైతులు పంటలకు నిప్పు పెడుతున్నారు. -
కరెంటు లేక పంటకు నిప్పు
బీర్కూర్: కరెంటు కోతలు రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన దాసరి లక్ష్మయ్య మూడు ఎకరాలు కౌలుకు తీసుకోని ఖరీఫ్‌లో నాట్లు వేశాడు. ఎకరానికి 12 బస్తాల చొప్పున కౌలు పెట్టాల్సి ఉంటుంది. పంట సాగు చేసేందుకు ఎకరానికి సుమారు రూ. 20 వేలు ఖర్చయింది. వానలు లేవు, కరెంటు సైతం తీవ్ర ఇబ్బందులు పెట్టింది. దీంతో పొట్ట దశకు వచ్చిన పంట కళ్లముందే ఎండిపోయింది. పంట పాలు తాగాల్సిన సమయంలో నీళ్లు లేకపోవడంతో పంట అంతా పొల్లు పోయింది. ఎండిన పంటను చూసి తట్టుకోలేక లక్ష్మయ్య పంటకు నిప్పు పెట్టాడు. -
కరెంటు కోతలపై నిరసనాగ్రహం
ఖానాపూర్ : కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు ఖానాపూర్‌లో ఆందోళనకు దిగారు. స్థానిక జగన్నాథ్ చౌరస్తాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో కాలిపోయిన విద్యుత్ మోటార్ల తో సోమవారం గంటకు పైగా రాస్తారోకో చేశారు. విద్యుత్ ఆధారితంగా పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకుండా అనధికారికంగా ఎడాపెడా కోతలు విధిస్తోందని మండిపడ్డారు. అలాగే నాణ్యమై న విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపో యి, మోటార్లు కాలి తీవ్రంగా నష్టపోతున్నామంటూ రోడ్డు పై బైఠాయించారు. బతుకమ్మ వేడుకల పేరిట తెలంగాణ జాగృతికి రూ.10 కోట్లు, బ్రాండ్ అంబాసిడర్ అంటూ టెన్ని స్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రూ.2 కోట్లు అవసరం లేకు న్నా ఇచ్చిన కేసీఆర్ రైతు సమస్యలపై మాత్రం దృష్టిసారించ డం లేదని ఎద్దేవా చేశారు. పంటలు పండక అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కోతలతో నష్టపోయిన పంటలతో పాటు లోవోల్టేజీతో కాలిపోయిన మోటార్ల రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదేనా బాగు! తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుందనుకున్నామే గానీ ఈ విధంగా సమస్య ఉంటుందనుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కష్టాలను ప్రజలు మూడేళ్లపాటు ఓపిక పట్టాలని కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రైతులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా అటు ప్రభుత్వంలో గానీ ఇటు అధికారుల్లో గానీ ఎలాంటి చలనం లేదని విమర్శించారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ బైఠాయింపు కొనసాగించారు. బలవంతంగా అరెస్టు అంతకుముందు చౌరస్తా ప్రాంతంలోని ఇతర కూడళ్లంన్నింటి రహదారులకు అడ్డంగా వాహనాలు పెట్టి దిగ్బంధించారు. దీంతో ఎస్సై టీవీరావుతో పాటు పోలీసులు ఎంత చెప్పినా రైతులు ఆందోళన విరమించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐ జీవన్‌రెడ్డి రంగప్రవేశం చేసి పలువురు రైతులు, నాయకులను బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గోసంపల్లెకు చెందిన రైతు కొమురయ్య సీఐ వాహనం కింద టైరుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని నినాదాలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీ కమ్మల బాలరాజు, మాజీ ఎంపీటీసీ అంకం రాజేందర్, ఉప సర్పంచులు బర్లపాటి బీమరాజు, వీరేశ్, నాయకులు సల్ల దేవెందర్‌రెడ్డి, కరిపె శ్రీనివాస్, బీసీ రమేశ్, మాన్క దేవన్న, ఆమంద శ్రీనివాస్, పంతులు, నరేందర్, గంగాధర్, సందీప్, చందు, స్కైలాబ్ పాల్గొన్నారు. -
రబీ రెడీ
కరీంనగర్ అగ్రికల్చర్ : ఓ వైపు కరెంటు కోతలు.. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో అన్నదాత అరిగోస పడుతుండగానే ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ వచ్చేసింది. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోగా ఉన్న కొద్దిపాటి పంటలు ఈ నెలాఖరులో చేతికందనున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ నష్టాన్ని పూడ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు రబీ ప్రణాళిక సిద్ధం చేశారు. వరి పైనే దృష్టి పెట్టకుండా ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తున్నారు. ఈ మేరకు రబీలో వేయాల్సిన పంటలు, కావాల్సిన విత్తనాలు, ఎరువులపై వ్యవసాయశాఖ ప్రణాళిక ఖరారు చేసింది. 2.75 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేయనున్నట్లు అంచనా వేసింది. వరితోపాటు వేరుశనగ పంటపై అధిక దృష్టి సారించింది. ఆహారధాన్యాల సాగును కూడా ప్రోత్సహిస్తోంది. ఎరువులను నెలలవారీగా రైతులకు ఇవ్వనున్నారు. 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు అందించనుంది. ఇప్పటికే మండలాల వారీగా సబ్సిడీ విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. ప్రణాళిక వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు వ్యవసాయశాఖ జేడీ బి.ప్రసాద్ తెలిపారు. కరెంటు కొరత రైతులను వేధిస్తోంది. కోతలు రోజు రోజుకు పెరుగుతుండగా ఇప్పుడు వ్యవసాయానికి సరఫరా అధికారికంగానే నాలుగు గంటలకు మించడం లేదు. ప్రాజెక్టులు, చెరువుల్లో ఆశించిన మేర నీటి వనరులు కూడా లేవు. ఈ నేపథ్యంలో అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పంటలసాగును ప్రోత్సహిస్తేనే రైతులకు ఉపయోగం జరిగే అవకాశముంటుంది. లేనిపక్షంలో మళ్లీ నష్టాలు తప్పవు.