‘చితి’కిన రైతు | the power cuts .. Dry crops | Sakshi
Sakshi News home page

‘చితి’కిన రైతు

Published Mon, Nov 3 2014 2:23 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

the power cuts  .. Dry crops

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 3.90 లక్షల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకునే జీవిస్తున్నారు. గత ఏడాది అతివృష్టి, వడగళ్ల వానాలతో పంటలు తీవ్రంగా నష్టపోయారు. కొత్త రుణాలు, పంట నష్టపరిహారం అందకపోవడంతో వడ్డీ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించి పంటలు వేసుకున్నారు.

కరెంటు కోతలతో కళ్ల ముదే ఎండిపోతున్న పంటలను చూడలేక.. పెట్టిన పెట్టుబడి అప్పు తీర్చలేక ఆందోళనతో ఇప్పటి వరకు 52 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు లేక జిల్లాలో సాధారణ స్థాయిలో పంట భూములు సాగు చేసుకోలేదు. 6.50 లక్షల హెక్టార్లలో సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళిక రుపొందించారు. తగ్గిన వర్షాభావ పరిస్థితుల కారణంగా 5.47 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేసుకున్నారు.

ఆశించిన వర్షాలు లేక విత్తుకున్న పంటలు భూమిలో మొలకెత్తక మురిగి పోయి.. రెండుమూడు సార్లు వేసుకున్నారు. దీంతో రైతులకు ఆర్థిక భారం అధికమైంది. సెప్టెంబర్ మొదటివారంలో కురిసిన వర్షాలు తప్ప చెప్పుకోదగ్గ వర్షాలు కురువలేదు. దీంతో వరి సాగు 60వేల హెక్టార్లలో సాగు కావాల్సిన వరి సాగు అత్యల్పంగా 18వేల హెక్టార్లకే పరిమితమైంది. రిజర్వయర్లు, చెరువుల్లోని నీరు పంటకు నీరు అందించ లేక ఎండిపోతున్నయి. పత్తి, సోయా, కంది పంటల పరిస్థితీ ఇదే విధంగా ఉంది.

 తగ్గిన వర్షపాతం
 గత ఏడాది ఇదే సమయానికి 1,082 మిల్లీమీటర్ల వర్షపాతం.. సాధారణ వర్షాపాతం కంటే అధికంగా కురిసిం ది. ఈసారి ఇప్పటివరకు730 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 31శాతం మేరకు తక్కువగా నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. జలాశయాల కింద పంట సాగు చేసుకునేందుకు రైతులు వెనకడుగు వేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్సీ) జలాశయంలో వరదనీరు రాలేదు. మిగితా జలాశయల పరిస్థితి అదేవిధంగా ఉంది. జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగుచేసిన పంటలకు నీరందక దిగుబడి భారీగా పడిపోయింది.

 ఇప్పడున్న ప్రాజెక్టుల నీటితో రబీ సాగుకు నీరు అందించడం సాధ్యం కాదని అధికారులే పేర్కొంటున్నారు. జిల్లాలో రబీ సాగు అయ్యేది వరి పంట అధికంగా అవుతుంది. నెలకొన్న పరిస్తితుల దృష్ట్యా వ్యవసాయ అధికారులు ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమమని రైతులకు సూచిస్తున్నారు. జిల్లాలో 52 మండలాలకు గాను కేవలం సిర్పూర్ మండలంలో సాధారణ వర్షపాతం నమోదైంది. 11 మండ లాల్లో 70 నుంచి 80 శాతం వరకు పడింది మిగితా 40 మండలాల్లో 40 నుంచి 60 శాతం లోటు వర్షాపాతం నమోదైంది. ఈ మండలాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయి. వవ్యసాయ అధికారులు కరువు మండలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

 అందని రుణాలు
 గతంలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. రుణ మాఫీకై ప్రభుత్వం నెలల తరబడి కాలయపాన చేస్తూ 25 శాతం ప్రకటించింది. కొత్త రుణాలు అందుతాయని బ్యాంకుల చూట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.22.80 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణంయించారు. కానీ ఇప్పటి  వరకు సగం కూడా ఇవ్వలేదు.

 బ్యాంకు అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రూ.820 కోట్లు రుణాలు ఇచ్చామని చెబుతున్నా జిల్లాలో ఎక్కడ రీషెడ్యూల్ చేయలేదని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ కింద ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రూ. 3.64 కోట్లను రైతుల పాత రుణాలకు వడ్డీ కింద కట్ చేసుకుని మిగతాది రైతులకు చెల్లిస్తున్నారు.  

 వడ్డీ వ్యాపారులే దిక్కు
 సాగు గడువు దాటిపోతుందని రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. కొంతమంది వడ్డీ వ్యాపారులు రైతుల పట్టాపాసుబుక్ దగ్గర పెట్టుకొని, ఒప్పంద పత్రాలు రాయించుకుని 20శాతం వడ్డీ చొప్పున అప్పు అందజేశారు. ఈ రకంగా ఈ ఖరీఫ్‌లో జిల్లాలో రూ.400 కోట్ల వరకు వ్యాపారులు వడ్డీపై డబ్బులను రైతులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 కరెంటు కష్టాలు
 బోరుబావుల నీరును పంటకు అందించి దిగుబడి సాధించాలనుకున్న రైతులకు కరెంట్ కోతలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఏడు గంటలు కరెంట్‌ను ఐదు గంటలకు కుదించారు. ఇప్పడు కేటాయించిన సమయంలోనైనా రెండు గంటలైనా సరఫరా చేయకపోవడంతో పంటలకు నీరందక పూత, కాత దశలోనే ఎండిపోతున్నాయి.

 సగానికి తగ్గిన దిగుబడి
 వర్షాభావ పరిస్థితులు, పూత, కాత దశలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల నేలలో తేమ తగ్గి ఎండి పోవడం, చీడపీడల ఉధృతి అధికం కావడంతో పంట దిగుబడి పడిపోయింది. హెక్టార్‌కు 25క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాల్సింది ఉండగా వర్షాభావ, చీడపీడల కారణంగా హెక్టార్‌కు 10 నుంచి 15 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోంది.

 సోయా పంట దిగుబడి మరింత తగ్గుతోంది. హెక్టార్‌కు 4 నుంచి 5 క్వింటాళ్లు రావడం గగనంగా మారుతోంది. వరి పంట ఆలస్యంగా నాటు వేసిన కారణంగా పొట్టదశలో ఉన్న పంటకు నీరు అందించలేక ఎండిపోతున్నాయి. సోయా, వరి పంట కోత, నూర్పిడి ఖర్చు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రైతులు పంటలకు నిప్పు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement