రబీ రెడీ
కరీంనగర్ అగ్రికల్చర్ :
ఓ వైపు కరెంటు కోతలు.. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో అన్నదాత అరిగోస పడుతుండగానే ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ వచ్చేసింది. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోగా ఉన్న కొద్దిపాటి పంటలు ఈ నెలాఖరులో చేతికందనున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ నష్టాన్ని పూడ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు రబీ ప్రణాళిక సిద్ధం చేశారు. వరి పైనే దృష్టి పెట్టకుండా ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తున్నారు.
ఈ మేరకు రబీలో వేయాల్సిన పంటలు, కావాల్సిన విత్తనాలు, ఎరువులపై వ్యవసాయశాఖ ప్రణాళిక ఖరారు చేసింది. 2.75 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేయనున్నట్లు అంచనా వేసింది. వరితోపాటు వేరుశనగ పంటపై అధిక దృష్టి సారించింది. ఆహారధాన్యాల సాగును కూడా ప్రోత్సహిస్తోంది. ఎరువులను నెలలవారీగా రైతులకు ఇవ్వనున్నారు. 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు అందించనుంది. ఇప్పటికే మండలాల వారీగా సబ్సిడీ విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. ప్రణాళిక వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు వ్యవసాయశాఖ జేడీ బి.ప్రసాద్ తెలిపారు. కరెంటు కొరత రైతులను వేధిస్తోంది. కోతలు రోజు రోజుకు పెరుగుతుండగా ఇప్పుడు వ్యవసాయానికి సరఫరా అధికారికంగానే నాలుగు గంటలకు మించడం లేదు. ప్రాజెక్టులు, చెరువుల్లో ఆశించిన మేర నీటి వనరులు కూడా లేవు. ఈ నేపథ్యంలో అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పంటలసాగును ప్రోత్సహిస్తేనే రైతులకు ఉపయోగం జరిగే అవకాశముంటుంది. లేనిపక్షంలో మళ్లీ నష్టాలు తప్పవు.