Power Tariffs
-
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ రాచమల్లు కామెంట్స్
-
‘లోటు’ పాట్లపై లోతుగా..
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారిఫ్ సవరణ(చార్జీల పెంపు) ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్‌మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం, ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లను డిస్కంలు గత నెల 30న ఈఆర్సీకి సమర్పించిన విషయం తెలిసిందే. ఏఆర్‌ఆర్‌తోపాటే సమర్పించాల్సిన టారిఫ్ పెంపు ప్రతిపాదనలను అప్పట్లో డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. భారీ ఆదాయలోటులో ఉన్న డిస్కంల మనుగడ కోసం చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే ఈఆర్సీ స్పష్టం చేసింది. ఆదాయలోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచేందుకున్న అవకాశాలు ఏమిటి? సబ్సిడీలుపోగా మిగిలి ఉండే లోటు పూడ్చుకోవడానికి ఏ మేరకు టారిఫ్ పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించాలి? అన్న అంశాలపై మంత్రులు లోతుగా చర్చించారు. ఆర్థికలోటు పూడ్చడానికి ఉన్న ఇతర మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావులకు సూచించారు. డిస్కంల ఆర్థిక పరిస్థితి, టారీఫ్ ప్రతిపాదనలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయించారు. విద్యుత్‌పై భారీగా పెట్టుబడులు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.వేల కోట్ల పెట్టుబడులు, వ్యయప్రయాసలతో రాష్ట్ర విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యాన్ని భారీగా పెంచినట్టు అధికారులు మంత్రులకు నివేదించారు. జెన్కో స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 16,623 మెగావాట్లకు పెరిగిందన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.33,722 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో 2,700 మెగావాట్ల లోటు ఉండేదని, కేవలం 6 నెలల్లోనే కోతలు అధిగమించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామని వివరించారు. సౌర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 74 మెగావాట్లు నుంచి 3997 మెగావాట్లకు, గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్ల నుంచి 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. వినియోగదారుల సంఖ్య కోటీ 11 లక్షల నుంచి కోటీ 68 లక్షలకు, తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2,012 యూనిట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 19 లక్షల నుంచి 25.92 లక్షలకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరిగాయన్నారు. ట్రాన్స్‌కో పరిధిలోని సబ్ స్టేషన్ల సంఖ్య 233 నుంచి 361కు పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు పెరిగిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టు విద్యుత్ సంస్థల విద్యుత్ టారిఫ్ పెంచుకోవడానికి అనుమతికోరినట్టు తెలిసింది. -
న్యూఇయర్‌లో పవర్ షాక్..!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుండటంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని విద్యుత్ డిస్కంలు చార్జీల పెంపును ప్రతిపాదించనున్నాయి. జనవరి 25తో మునిసిపల్ ఎన్నికలు ముగియనుండగా, 31న ఈఆర్సీకి డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో భాగంగా ఈ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. 2019–20 ముగిసే నాటికి డిస్కంల ఆర్థిక లోటు రూ. 11,000 కోట్లకు చేరనుందని, బడ్జెట్లో ప్రభుత్వం కేటా యించిన రూ.6,079 కోట్ల విద్యుత్ రాయితీలు పోగా మొత్తం రూ.5,000 కోట్ల ఆర్థిక లోటు మిగలనుందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సబ్సిడీలు తీసేసినా, 2020–21లో ఆర్థిక లోటు రూ. 6,000 కోట్లకు చేరనుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. అన్ని రకాల కేటగిరీలపై ప్రభావం... చార్జీల పెంపు ద్వారా సుమారు రూ.1000 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని డిస్కంలు భావిస్తున్నాయి. దీంతో గృహ, వాణిజ్య తదితర అన్ని కేటగిరీలపై వినియోగదారులపై మోస్తారుగా విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం పడనుంది. నెలకు 100–200 యూనిట్ల విద్యుత్ వినియోగించే మధ్యతరగతి, 300 యూనిట్లపైగా వినియోగించే ఎగువ తరగతి కుటుంబాలపై చార్జీల పెంపు ప్రభావం చూపే చాన్సుంది. పారిశ్రామిక కేటగిరీ చార్జీలను స్వల్పంగా పెంచే అవకాశాలున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి 2020–21కి సంబంధించిన టారీఫ్ ఉత్తర్వులను జారీ చేయనుంది. దీంతో 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో చార్జీల పెంపు అమల్లోకి రానుంది. -
కరెంటు చార్జీలు పెరగవ్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. రాష్ట్రంలో వచ్చే ఏడాది కూడా చార్జీల మోత లేనట్టే. కరెంటు చార్జీలు పెంచొద్దని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రస్తుత టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు 2017–18లోనూ ప్రస్తుత టారిఫ్‌నే అమలు చేసేందుకు అనుమతి కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) సమర్పించేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. నవంబర్ నెలాఖరులోగా దీన్ని సమర్పించాల్సి ఉండగా ఈ నెల 15 దాకా గడువు కోరాయి. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు తదితర వినియోగదారులకు ప్రస్తుత చార్జీలనే ప్రతిపాదిస్తూ రెండు మూడు రోజుల్లో నివేదిక సమర్పించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) కసరత్తు చేస్తున్నాయి. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ విద్యుత్ చార్జీలు పెరగని విషయం తెలిసిందే. మరోవైపు సీఎం ఆదేశాను సారం జనవరి 1 నుంచి వ్యవసాయా నికి 24 గంటల కరెంటు సరఫరాకు కూడా డిస్కంలు సన్నద్ధమవుతున్నాయి. తద్వారా పెరిగే వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యయ భారం ఇతర వినియోగదారులపై పడకుండా డిస్కంలకు విద్యుత్ సబ్సిడీ పెంచుతామని సీఎం ఇటీవల హామీ ఇచ్చారు. వాటికి వార్షిక సబ్సిడీ కేటాయింపులను ప్రస్తుత రూ.4,777 కోట్ల నుంచి రూ.5,400 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. -
‘పవర్’ పోరు షురూ!
సాక్షి, ముంబై: ముందుగా హెచ్చరించినట్లుగానే దక్షిణ ముంబై పార్లమెంట్ సభ్యుడు సంజయ్ నిరుపమ్ కాందీవలిలోని రిలయన్స్ ఎనర్జీ కార్యాలయం ముందు సోమవారం ఆందోళనకు దిగారు. ఆయనకు ఎంపీ ప్రియాదత్ కూడా మద్దతు పలికారు. విద్యుత్ టారిఫ్‌ను తగ్గించకపోతే ఆందోళనకు దిగుతామని వారంరోజుల క్రితం నిరుపమ్ హెచ్చరించిన విషయం తెలి సిందే. తగ్గించేవరకు కార్యాలయం ముందునుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్న ఈ ఆందోళనలో నిరుపమ్ ప్రసంగిస్తూ... ‘విద్యుత్ టారిఫ్‌ను తగ్గిస్తూ రిలయన్స్ కంపెనీ ప్రక టన చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదు. మొండికేస్తే మా పార్టీ ఎంపీలు నిరవధిక నిరాహార దీక్షకు దిగుతార’ని హెచ్చరించారు. రిలయన్స్ కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీని ‘దొంగ’ అంటూ నినాదాలు చేశారు. గతంలోనే ఈ విషయమై సంజయ్ నిరుపమ్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు లేఖ రాశారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ చార్జీలను తగ్గించినప్పుడు ముంబై లోకూడా ఎందుకు తగ్గించకూడదని లేఖలో ప్రశ్నించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి కూడా నిరుపమ్ లేఖ రాశారు. టారిఫ్ తగ్గించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఇరువురి నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో నిరుపమ్ ఆందోళనబాట పట్టారు. ఫిక్స్డ్ చార్జీలు, ఆస్తుల క్రమబద్ధీకరణ పేరుతో వసూలు చేస్తున్న చార్జీల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఎంపీ ప్రియాద త్ మాట్లాడుతూ... ముంబై, శివారు ప్రాంతాలకు ఏకీకృత టారిఫ్ విధానముండాలన్నారు. టారిఫ్‌ను తగ్గించకపోతే ఆందోళన మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. తమ పార్టీ నేతలందరు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటారని, అంతవరకు పోకుండా ముందుగానే టారిఫ్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా నారాయణ్ రాణే నేతృత్వంలోని కాంగ్రెస్ మంత్రుల బృందం కూడా ఈ విషయంపై స్పందించింది. 10 నుంచి 20 శాతం టారిఫ్‌ను తగ్గించాలంటూ మంత్రుల బృందం డిమాండ్ చేసింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న పేదలకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయని, చార్జీలు తగ్గించాలని గత వారం కిందట శివసేన నేత అనిల్ పరబ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది వినియోగదారుల బిల్లులు తగ్గించాలని రిలయన్స్ ఎనర్జీ కంపెనీని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ధర్నా, ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే బాట కాంగ్రెస్ నాయకులు పట్టారు. ఆప్‌ను అడ్డుకునేందుకే..! ఢిల్లీలో ప్రారంభించినట్లుగానే ముంబైలో కూడా విద్యుత్ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ప్రారంభిస్తుందోనన్న భయంతోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ ఆందోళనకు దిగినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై కన్నేసిన ఆప్ పుణే, ముంబైలలో ఇప్పటికే పార్టీ కార్యకలాపాలను వేగం చేసింది. దీంతో ఆ పార్టీ కంటే ఓ అడుగు ముందేసి విద్యుత్ చార్జీలను తగ్గించిన ఘనత తమ పార్టీకే దక్కాలని కాంగ్రెస్ నేతలు ఈ వ్యూహం అమలు చేసినట్లుగా చెబుతున్నారు. అందులోభాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులే పోరాట ం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఆందోళన తర్వాత ఆప్ ఉద్యమాన్ని ప్రారంభించినా ఆ పార్టీకి కీర్తి దక్కకుండా చేయడమే కాంగ్రెస్ నేతల వ్యూహంగా భావిస్తున్నారు. ఎంఆర్‌ఈసీ చట్టం-2003 ప్రకారమే.. రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్‌ను మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ చట్టం-2003 ప్రకారమే వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటించింది. టారిఫ్‌పై నిర్ణయాన్ని ఎంఆర్ఈసీకే వదిలేయాలని సుప్రీం కోర్టు కూడా ప్రకటించిందని, ఈ విషయంలో దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోలేవని ఆ కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.