
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. రాష్ట్రంలో వచ్చే ఏడాది కూడా చార్జీల మోత లేనట్టే. కరెంటు చార్జీలు పెంచొద్దని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రస్తుత టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు 2017–18లోనూ ప్రస్తుత టారిఫ్‌నే అమలు చేసేందుకు అనుమతి కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ)కి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్) సమర్పించేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి.
నవంబర్ నెలాఖరులోగా దీన్ని సమర్పించాల్సి ఉండగా ఈ నెల 15 దాకా గడువు కోరాయి. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు తదితర వినియోగదారులకు ప్రస్తుత చార్జీలనే ప్రతిపాదిస్తూ రెండు మూడు రోజుల్లో నివేదిక సమర్పించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) కసరత్తు చేస్తున్నాయి. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ విద్యుత్ చార్జీలు పెరగని విషయం తెలిసిందే.
మరోవైపు సీఎం ఆదేశాను సారం జనవరి 1 నుంచి వ్యవసాయా నికి 24 గంటల కరెంటు సరఫరాకు కూడా డిస్కంలు సన్నద్ధమవుతున్నాయి. తద్వారా పెరిగే వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యయ భారం ఇతర వినియోగదారులపై పడకుండా డిస్కంలకు విద్యుత్ సబ్సిడీ పెంచుతామని సీఎం ఇటీవల హామీ ఇచ్చారు. వాటికి వార్షిక సబ్సిడీ కేటాయింపులను ప్రస్తుత రూ.4,777 కోట్ల నుంచి రూ.5,400 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.