ఫార్చ్యూన్ శక్తివంత మహిళల్లో 8 మంది భారతీయులు
న్యూయార్క్: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన 25 మంది మహిళల్లో(వ్యాపార రంగం) ఈ ఏడాది ఎనిమిది మంది భారతీయులకు చోటుదక్కింది. అంతర్జాతీయ బిజినెస్ మేగజీన్ ఫార్చ్యూన్ ఈ జాబితాను రూపొం దించింది. టాప్-10లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ రెండో స్థానంలో నిలిచారు. దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య(4వ స్థానం), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవ(5వ స్థానం) తొలిసారి జాబితాలో చోటుదక్కించుకున్నారు.
వాసుదేవ ఒక భారతీయ ఆయిల్ కంపెనీకి తొలి మహిళా సారథి కావడం గమనార్హం. యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ 10 ర్యాంక్‌లో నిలిచారు. ఆస్ట్రేలియా బ్యాంకింగ్ దిగ్గజం వెస్ట్‌ప్యాక్ సీఈఓ గెయిల్ కెల్లీ నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు.
ఇక టాప్-25లో భారత్ నుంచి బయోకాన్ సీఈఓ కిరణ్ మజుందార్ షా(19వ ర్యాంక్), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) సీఈఓ చిత్రా రామకృష్ణ(22), హెచ్ఎస్బీసీ ఇండియా హెడ్ నైనా లాల్ కిద్వాయ్(23), టఫే సీఈఓ మల్లికా శ్రీనివాసన్(25) ఉన్నారు. మహిళా వ్యాపారవేత్తలు అత్యంత కఠినమైన, భారీ సంస్థల్లో ఉన్నతమైన స్థానాలను అందుకుంటున్నారని.. ప్రపంచానికి మార్గనిర్ధేశం చేయడంలో తమ శక్తిసామర్థ్యాలను చాటిచెబుతున్నారని ఫార్చ్యూన్ పేర్కొంది.