prabhakar chintamaneni
-
చింతమనేని వర్సెస్ ముళ్లపూడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో కుంపట్లు పెరిగిపోతున్నాయి. ఆధి పత్య పోరుతో నాయకులు రోడ్డెక్కడం పరిపాటిగా మారిపోయింది. మద్యం షాపుల గొడవతో ఎడమొహం పెడమొహంగా మారిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య తాజాగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబునాయుడి వ ద్దకు చేరింది. వీరి గొడవకు పంచాయతీరాజ్ డీఈ ఒకరు సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పెదవేగి మండలం ముండూరులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అ ధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ తండ్రికి జిల్లా పరిషత్ చైర్మన్‌తో బంధుత్వం ఉంది. మరోవైపు ప్రొటోకాల్ కూడా ఉండటం తో ఆ శిలాఫలకాలపై జెడ్పీ చైర్మన్ పేరు వేయించారు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జెడ్పీ చైర్మన్ పేరు వేస్తే తాను రానని చెప్పడంతో అతని పేరు ఉన్న చోట పెయింటింగ్ వేశారు. అదేచోట స్థానిక ఎంపీటీసీ పేరు వేయాలని చింతమనేని అడగ్గా ముండూరు నాయకులు ససేమి రా అన్నారు. చింతమనేని రానని చెప్పడంతో గ్రామ సర్పంచ్ పేరుతో శిలాఫ లకం తయారు చేసి వారే ప్రారంభోత్సవాలు చేసేశారు. ఈ విషయం జెడ్పీ చైర్మన్ దృష్టికి వెళ్లింది. కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రొటోకాల్ ప్రకారం తన పేరు వేయకుండా ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ జెడ్పీ చైర్మన్ బాపిరాజు పంచాయతీరాజ్ ఎస్ఈని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అన్ని ప్రారంభోత్సవాల వివరాలు, ఫొటోలు కావాలని అడిగారు. ఫొటోలు తెప్పించుకుని తనపేరు ఎక్కడా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి తన పేరు వేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పినట్టు సమాచారం. అధికారులపై చర్య తీసుకుంటారు గాని, విప్‌పై చర్యలు ఏ ముంటాయని ప్రశ్నించిన బాపిరాజు అసలు మీరు ఇచ్చిన చనువు వల్లే ఇలా జరుగుతుందని కలెక్టర్‌పై నిష్టూరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం విషయం తెలిసిన జిల్లా ఇన్చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు జెడ్పీ చైర్మన్‌కు ఫోన్ చేసి తనను కలవాలని, కూర్చొని వివా దం పరిష్కరించుకుందామని చెప్పారు. అందుకు సుముఖంగా లేని జెడ్పీ చైర్మన్ బాపిరాజు శుక్రవారం రాత్రి అమరావతిలో సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన ఆధీనంలో ఉన్న విభాగాల్లో పనిచేస్తూ ప్రొటోకాల్ ప్రకారం తన పేరు వేయకపోయినా తన దృష్టికి తీసుకురాకపోవడంతో ఏలూరు పంచాయతీరాజ్ డీఈపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సెలవుపై వెళ్లారు. -
చింతమనేనిని అరెస్ట్ చేయూలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ ఏలూరు (మెట్రో) : అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ శుక్రవారం విరుచుకుపడిన ఘటనను మహిళా, కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. శనివారం జిల్లా ఐద్యా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు జి.విజయలక్ష్మి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐద్యా జిల్లా నాయకురాలు జి.విమల మాట్లాడుతూ చింతమనేని జీవితం రౌడీయిజంతో ముడిపడి ఉందన్నారు. తల్లిదండ్రులను కష్టపెట్టటం, కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవటం వంటివి ఆయన జీవిత చరిత్రలో ఓ భాగమని చెప్పారు. ఉపయోగించుకుని వదిలిపెట్టేసే వ్యక్తి చింతమనేని అని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తిని చట్టసభలోకి ఎందుకు పంపించారో అర్ధం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గంపల బ్రహ్మావతి మాట్లాడుతూ ఇటువంటి వారి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఎం జిల్లా అధ్యక్షులు బి.బలరామ్ మాట్లాడుతూ చింతమనేనికి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. టీడీపీకి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అతనిని అరెస్ట్ చేయాలన్నారు. రౌడీషీటర్, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పార్టీ పదవులు కట్టబెట్టడం తగదన్నారు. తక్షణమే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలన్నారు. మున్నుల జాన్గుర్నాథ్ మాట్లాడుతూ రౌడీలతో, గూండాలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారనడానికి చింతమనేని తీరే నిదర్శనమన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారిత గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి వెంటనే చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
తుపాకీ... వెనక్కి!
సాక్షి ప్రతినిధి, ఏలూరు :రౌడీషీట్‌తో సహా 38 కేసులు పెండింగ్‌లో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు వ్యక్తిగత తుపాకీ లెసైన్స్ ఇచ్చేందుకు పోలీసులు సిఫార్సు చేయడం వివాదాస్పదమైంది. ఇటీవలి కాలంలో ఆయనకు వ్యక్తిగత గన్‌లెసైన్స్ ఇచ్చేందుకు పోలీసులు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫైల్ పంపించారు. ఇదే విషయమై ‘సాక్షి’ దినపత్రికలో రెండు వారాల కిందట ‘చింతమనేనికి తుపాకీ’ శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. ‘సాక్షి’ కథనంతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ, పోలీసు అధికారులు ఇప్పుడు ఆ గన్‌లెసైన్స్ మంజూరు వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. సహజంగా నేరచరిత్ర, పోలీసు కేసులు ఉన్న వారికి పోలీసులు పొరపాటున కూడా తుపాకీ లెసైన్సులకు సిఫార్సు చేయరు. ఎన్నో దశల్లో విచారణ చేపట్టి ఏ చిన్న కేసు కూడా లేదని తేలితేనే మంజూరు చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేస్తారు. కానీ ఏకంగా రౌడీషీట్‌తో పాటు లెక్కకు మించిన కేసులు ఉన్న ప్రభాకర్‌కు గన్‌లెసైన్స్ ఇచ్చేందుకు జిల్లా పోలీసులు సంసిద్థత వ్యక్తం చేస్తూ ఫైలును రెవెన్యూ విభాగానికి పంపారు. ఇంత నేరచరిత్ర, రౌడీషీట్ ఉన్న ఎమ్మెల్యేకి గన్‌లెసైన్స్‌కు ఎలా సిఫార్సు చేశారని పోలీస్ కమ్యూనికేషన్స్ ఉన్నతాధికారి ప్రశ్నించినా విప్ కాబట్టే సిఫార్సు చేశామంటూ సమాధానాలు చెప్పుకొచ్చారు. కానీ ‘సాక్షి’ కథనం కలకలం రేపిన నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ నెల 26వ తేదీన ఆఫైల్‌ను ‘నాట్ రికమండెడ్ ప్రాపర్లీ’ అని కోట్ చేసి తిరిగి పంపినట్టు తెలిసింది. నిబంధనలను అతిక్రమించి అంత ఏకపక్షంగా ఇవ్వాల్సిన అవసరమేమిటంటూ పోలీసు ఉన్నతాధికారులు కూడా తప్పుపట్టిన నేపథ్యంలో ఇక తుపాకీ లెసైన్స్ వ్యవహారం పెండింగ్‌లో పడినట్టేనని భావిస్తున్నారు. -
సిగ్గు లేకుండా పింఛన్లు తీసుకోండి
* చంద్రబాబు ఫొటోకు దండం పెట్టుకోండి * ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఏలూరు రూరల్ : ‘టీడీపీకి ఓట్లు వేయని వారు సిగ్గు లేకుండా పింఛన్లు తీసుకోండి. కాకపోతే వాళ్లంతా చంద్రబాబునాయుడు ఫొటోకు దండం పెట్టుకోండి’ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పింఛను లబ్ధిదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మల్కాపురంలో సోమవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సభలో పాల్గొన్న ఆయన పింఛనుదారులను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ‘మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశారు. మీరు నాకు నీళ్లు పోసినా, నేను పాలు పోస్తున్నా. అర్హులైన వారందరకీ పింఛన్లు ఇప్పిస్తా. అయితే మీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు’ అని వ్యాఖ్యానించారు. మాదేపల్లిలో జరిగిన సభలోనూ ఇదేవిధంగా మాట్లాడారు. ‘ఎంపీపీ మనవాడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులూ మన పార్టీయే. ఒక్క సర్పంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. నన్ను ఓటమి పాలు చేద్దామనుకున్న సర్పంచ్ కోసూరి సుబ్బారావుకు రెండు దండాలు’ అంటూ హేళన చేశారు. చింతమనేని ఇలా మాట్లాడటంపై గ్రామస్తులు విస్తుపోయారు. ప్రజాప్రతినిధిగా పార్టీలకు అతీతంగా పనిచేయాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరచి, ప్రజలను పార్టీల ప్రాతిపదికన విడదీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రెడ్డి అనురాధ, జెడ్పీటీసీ సభ్యులు మట్టా రాజేశ్వరి, మండల ఉపాధ్యక్షులు మోరు హైమావతి పాల్గొన్నారు. -
ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మాగంటి నాగభూషణం.. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు.. కనీసం కార్యకర్త కూడా కాదు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వమూలేదు. అయినా సరే ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా స్థలాల కేటాయింపుల్లో అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు బహిరంగంగా మద్దతు పలికారు. చీటింగ్ కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. సోదాలు నిర్వహించేందుకు సోమవారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లగా, అక్కడకు చేరుకున్న చింతమనేని పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేం డీఐజీతో మాట్లాడుతున్నాం.. మీరు ఇక్కడి నుంచి వెళ్లండి.. అంటూ క్లాస్ పీకారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బజ్జి మౌనంగానే ఉన్నా చింతమనేని, ముళ్లపూడిలు మాత్రం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లతో అధికారపార్టీ నేతలు విధులకు ఒకింత ఆటంకం కలిగించినప్పటికీ పోలీసులు మాత్రం సోదాలు చేపట్టి ఆయన ఇంట్లో సుమారు 240 ఒరిజనల్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒరిజనల్ డాక్యుమెంట్లు ఎప్పటికప్పుడు స్థల విక్రేతలకు ఇవ్వాల్సి ఉండగా, ఏపీఐఐసీ వారికి చూపించి ఇస్తానంటూ మాగంటి తన వద్దే ఉంచుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మూడేళ్ల కిందట మాగంటిపై చింతమనేని ఫిర్యాదు సరిగ్గా మూడేళ్ల కిందట 2011 నవంబర్ 3వ తేదీన ఇదే మాగంటి నాగభూషణం ఆటోనగర్ స్థలాల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వాణిమోహన్‌కు ఫిర్యాదు చేశారు. తన దెందులూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ ఆటోనగర్ స్థలాల అక్రమాలపై బాధ్యత గల ఎమ్మెల్యేగా ఫిర్యాదు చేస్తున్నానని అప్పటి లేఖలో పేర్కొన్నారు. ఏపీఐఐసీ స్థలాలతో రియల్ ఎస్టేట్‌ను తలపించే విధంగా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన వారికి ఇవ్వకుండా తనకిష్టమైన వారికి ప్లాట్లు రాసిచ్చేస్తున్నారని నిందించారు. ఇదేమని అడిగితే తన కూతురి పేరిట 500 గజాల స్థలం ఇస్తానని మాగంటి ఆశ చూపారని కూడా ప్రభాకర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అదే చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు ప్రభుత్వ విప్ హోదాలో మాగంటి నాగభూషణంకు బహిరంగంగా మద్దతివ్వడం గమనార్హం. మాగంటిని అరెస్టు చేయాల్సిందే నినదించిన ఆటోనగర్ బాధితులు తమకు చెందాల్సిన ఆటోనగర్ భూమిని అక్రమ మార్గంలో నాయకులకు, తన కుటుంబ సభ్యులకు, బంధువులకు కేటాయించిన అధ్యక్షుడు నాగభూషణంను వెంటనే అరె స్ట్ చేయాలని ఆటోనగర్ బాధితులు డిమాండ్ చేశారు. మంగళవారం వారంతా ఆయనకు వ్యతిరేకంగా సీపీఎం జిల్లా కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.