ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు | tdp party mls Support on Maganti Nagabhushanam | Sakshi
Sakshi News home page

ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు

Published Wed, Nov 5 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు

ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : మాగంటి నాగభూషణం.. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు.. కనీసం కార్యకర్త కూడా కాదు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వమూలేదు. అయినా సరే ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా స్థలాల కేటాయింపుల్లో అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్,  టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు బహిరంగంగా మద్దతు పలికారు. చీటింగ్ కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. సోదాలు నిర్వహించేందుకు సోమవారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లగా, అక్కడకు చేరుకున్న చింతమనేని పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మేం డీఐజీతో మాట్లాడుతున్నాం.. మీరు ఇక్కడి నుంచి వెళ్లండి.. అంటూ క్లాస్ పీకారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బజ్జి మౌనంగానే ఉన్నా చింతమనేని, ముళ్లపూడిలు మాత్రం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లతో అధికారపార్టీ నేతలు విధులకు ఒకింత ఆటంకం కలిగించినప్పటికీ పోలీసులు మాత్రం సోదాలు చేపట్టి ఆయన ఇంట్లో  సుమారు 240 ఒరిజనల్ డాక్యుమెంట్లను  స్వాధీనం చేసుకున్నారు. ఒరిజనల్ డాక్యుమెంట్లు ఎప్పటికప్పుడు స్థల విక్రేతలకు ఇవ్వాల్సి ఉండగా, ఏపీఐఐసీ వారికి చూపించి ఇస్తానంటూ మాగంటి తన వద్దే ఉంచుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
 
 మూడేళ్ల కిందట మాగంటిపై  చింతమనేని ఫిర్యాదు
 సరిగ్గా మూడేళ్ల కిందట 2011 నవంబర్ 3వ తేదీన ఇదే మాగంటి నాగభూషణం ఆటోనగర్ స్థలాల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వాణిమోహన్‌కు ఫిర్యాదు చేశారు. తన దెందులూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ ఆటోనగర్ స్థలాల అక్రమాలపై బాధ్యత గల ఎమ్మెల్యేగా ఫిర్యాదు చేస్తున్నానని అప్పటి లేఖలో పేర్కొన్నారు. ఏపీఐఐసీ స్థలాలతో రియల్ ఎస్టేట్‌ను తలపించే విధంగా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన వారికి ఇవ్వకుండా తనకిష్టమైన వారికి ప్లాట్లు రాసిచ్చేస్తున్నారని నిందించారు. ఇదేమని అడిగితే తన కూతురి పేరిట 500 గజాల స్థలం ఇస్తానని మాగంటి ఆశ చూపారని కూడా ప్రభాకర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అదే చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు ప్రభుత్వ విప్ హోదాలో మాగంటి నాగభూషణంకు బహిరంగంగా మద్దతివ్వడం గమనార్హం.
 
 మాగంటిని  అరెస్టు చేయాల్సిందే  నినదించిన ఆటోనగర్ బాధితులు తమకు చెందాల్సిన ఆటోనగర్ భూమిని అక్రమ మార్గంలో నాయకులకు, తన కుటుంబ సభ్యులకు, బంధువులకు కేటాయించిన అధ్యక్షుడు నాగభూషణంను వెంటనే అరె స్ట్ చేయాలని ఆటోనగర్ బాధితులు డిమాండ్ చేశారు. మంగళవారం వారంతా ఆయనకు వ్యతిరేకంగా సీపీఎం జిల్లా కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement