అగ్రకులస్తులపై హోలీ రంగులు చల్లాడని..
అగ్ర కులానికి చెందిన వారిపై హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లిన వ్యక్తిని పోలీసులు కొట్టి చంపారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొదెర్మ జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ చౌదరి, మరికొంత మంది గ్రామస్తులు హోలీ సందర్భంగా రంగులు చల్లుకుంటున్నట్లు ఆమె భార్య తెలిపారు. ఈ సమయంలో అటువైపుగా వచ్చిన చౌకీదార్ రాజేంద్ర యాదవ్‌పై కూడా వీరందరూ రంగులు చల్లారని వెల్లడించారు.
దీంతో కోపగించుకున్న రాజేంద్ర.. రంగులు చల్లిన దళితలపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో గ్రామానికి వచ్చిన పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని స్పృహతప్పి పడిపోయే వరకూ చితకబాదారని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రదీప్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తను కలుసుకునేందుకు ఆయన సోదరుడితో కలిసి స్టేషన్‌కు వెళ్లగా చూడటానికి అనుమతించలేదని తెలిపారు. అంతేకాకుండా కులం పేరిట తమను దూషించారని ఆరోపించారు.
మరుసటి ప్రదీప్‌ను పోలీసులు ఇంటి వద్ద వదిలేశారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని.. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారని తెలిపారు.