Praja Prasathnam
-
కడపలో ప్రజా ప్రస్థానం కార్యక్రమం
-
పేదలకు ఇళ్ళ పట్టాలు పథకంపై ప్రజా చర్చ
-
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు కట్టిస్తా: షర్మిల
లింగాలఘణపురం: ‘రాజశేఖరరెడ్డి బిడ్డను మాట ఇస్తున్న ఆశీర్వదించండి.. వైఎస్సార్టీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తా’ అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల హామీనిచ్చారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా మంగళవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని నెల్లుట్ల నుంచి 236వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం జనగామ–సూర్యాపేట రోడ్డులో ఉన్న గుడిసెవాసుల వద్దకు వెళ్లి వారితో కొద్దిసేపు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇదే భూమిలో పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తానని, అంతవరకు ఖాళీ చేయవద్దని వారితో చెప్పారు. నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేదని గుడిసెవాసులు మొరపెట్టుకోగా వెంటనే రూ.15 లక్షలతో సోలార్ విద్యుత్‌కు ఏర్పాటు చేయాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. -
గొత్తి కోయలకూ ‘పోడు’ పట్టాలివ్వాలి
నర్మెట: పోడు భూములు సాగు చేసుకుంటున్న ఇతర ఎస్టీలతోపాటు గొత్తి కోయలకు కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొత్తి కోయలు అటవీ అధికారులను హత్య చేయడాన్ని తాను సమర్థించడం లేదని, అయితే వారు కూడా చాలా కాలం నుంచి పోడు చేసుకుని జీవిస్తున్నందున వారికి కూడా పట్టాలివ్వాలని అన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం జనగామ జిల్లా నర్మెట, తరిగొప్పుల మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా నర్మెట మండలం ఆగాపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, తన కుటుంబ సభ్యులే భూకబ్జాలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ నోరు మెదపడంలేదని, ఇదేనా బంగారు తెలంగాణ అని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ బీఆర్ఎస్ నేతల కబ్జాలకే ఉపయోగపడిందని మండిపడ్డారు. వైఎస్సార్ పాలనలో 9 రకాల నిత్యావసర సరుకులను పేదలకు రేషన్‌ద్వారా అందిస్తే.. కేసీఆర్ బెల్ట్‌షాపులను ఏర్పాటు చేసిన ఘనత దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర 3,700 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా తరిగొప్పులలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
ఎన్నికలు ఉంటేనే సీఎం బయటికొస్తారు..
స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి: సీఎం కేసీఆర్ దొర ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని, లేకుంటే ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆమె మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఎన్నికలు వస్తాయని, కేసీఆర్ వచ్చి మళ్లీ పిట్టకథలు చెబుతారని అన్నారు. ఇప్పుడు దళితబంధు అని మోసం చేస్తున్నారని, ఈసారి బీసీబంధు, ఎస్టీ బంధు అంటారని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ మాటలు నమ్మితే మిమ్మల్ని మీ బిడ్డలే క్షమించరని, ఈసారి కేసీఆర్ వస్తే కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలను కోరారు. వైఎస్సార్టీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఉద్యోగాల కల్పనపైనే ఉంటుందని, ఇళ్లు లేని ప్రతి పేదకుటుంబానికి మహిళ పేరిట పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అందరికీ రూ.3వేలు పెన్షన్‌ను అందిస్తామని అన్నారు. -
8 నుంచి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 8 నుంచి పునఃప్రారంభం కాను న్నట్లు పాద యాత్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ తెలి పారు. కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ పట్టణంలో భారీ బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచే షర్మిల పాదయాత్రను మొదలు పెడతారన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న షర్మిల.. ఇకపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకోనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.