‘ప్రాణహితా’స్త్రం
ప్రాణహిత–చేవెళ్ల... దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపైన తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మించి, ఎత్తిపోతల ద్వారా చేవెళ్ల వరకు నీరు అందించాలని ఆయన ఆశించారు. ఈ ప్రక్రియలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు నదులు, చెరువులు నింపుతూ ప్రాణహిత నీరు చేవెళ్ల వరకు చేరాలి. అయితే 2009 ఎన్నికల తరువాత మళ్లీ గద్దెనెక్కిన వైఎస్ఆర్ హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ప్రాజెక్టు ముందుకు పడలేదు.
2014లో తెలంగాణ ఆవిర్భావ ప్రకటన తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ప్రధానాంశమైంది. తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామని, ఐదేళ్లలో సాగునీరు, తాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తరువాత పరిస్థితి మారింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో రూపు మార్చుకుంది. గోదావరినదిపై కాళేశ్వరం ప్రాజెక్టుగా అవతరించింది. అయితే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మాత్రం మాసిపోలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కూడా ఉమ్మడి జిల్లాలో ఇదే ప్రధానాంశంగా మారుతోంది.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ సాగిస్తున్న ఎన్నికల ప్రచారానికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జిల్లాల పర్యటనల్లో స్థానిక అంశాలను ఫోకస్ చేస్తూ టీఆర్ఎస్కు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నేతృత్వంలో కో చైర్పర్సన్ డీకే.అరుణ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. నాలుగురోజులు సాగే ఈ పర్యటనలో ఆదిలాబాద్‌కు నాలుగేళ్లలో జరిగిన అన్యాయంపైనే ప్రధానంగా దృష్టి సారించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజై¯ను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించడంపై ప్రజలను చైతన్య పరిచాలని నిర్ణయించారు. కమీషన్ల కోసమే డిజైన్లు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గత కొంతకాలంగా ధ్వజమెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు ఇటీవల రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రభుత్వాన్ని తూర్పార పట్టడం ప్రారంభించారు. ‘డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం’గా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు
డిజైన్‌తో పాటు పేరు కూడా మార్చారని ధ్వజమెత్తారు.
భైంసాలో రాహుల్‌గాంధీ నోట ప్రాణహిత మాట చేవెళ్ల–ప్రాణహిత డిజైన్ మార్చి కాళేశ్వరం నిర్మించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. కొన్ని నెలల క్రితం బస్సు యాత్ర ద్వారా మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో పర్యటించిన సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర నాయకులు ఇదే అంశంపై బహిరంగ సభల్లో ప్రసంగించిన నేతలు తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు సాకరమైతే ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 2లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారానే పుష్కలంగా నీరందేదని, కాళేశ్వరం వల్ల అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీరందదని తమ ప్రచారంలో వివరించారు.
ఈ మేరకు ఈనెల 20న భైంసాకు వచ్చిన రాహుల్‌గాంధీకి తెలియజేసి, ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందనే విషయాన్ని చెప్పించారు. అదే సభలో రాహుల్ ‘అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు నచ్చదు. అందుకే కాంగ్రెస్ హయాంలో బాబాసాహెబ్ పేరిట చేపట్టిన ప్రాజెక్టును లేకుండా చేసి, కాళేశ్వరం పేరిట కొత్త ప్రాజెక్టు చేపట్టారని, కేసీఆర్ కుటుంబానికి లబ్ధి జరిగింద’ని ఆరోపణలు చేయించారు. రాహుల్ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడంతో నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే పర్యటనలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా జనం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు
.
ప్రచారంలో తుమ్మిడిహెట్టి పర్యటన
పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా నేతలు నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2గంటలకు ఇచ్చోడలో రోడ్‌షో నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరులో ప్రచారం నిర్వహిస్తారు. 2వ తేదీన జైనూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లలో ప్రచారం నిర్వహిస్తారు. 3వ తేదీన ఉదయం 8 గంటలకే కాగజ్‌నగర్ నుంచి తుమ్మిడిహెట్టికి హెలికాప్టర్లో ప్రయాణించి అక్కడే అల్పాహారం చేసి 10 గంటలకు బెల్లంపల్లి తిరుగు ప్రయాణం కానున్నారు. అనంతరం బెల్లంపల్లిలో ప్రచారం జరిపి హైదరాబాద్ వెళ్తారు. 4వ తేదీన చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. ఈ నాలుగు రోజుల పర్యటనలో తుమ్మిడిహెట్టిని హైలైట్ చేయడం ద్వారా అధికార టీఆర్ఎస్ను ఉమ్మడి జిల్లాలో ఇరుకాటంలో పెట్టాలనేది కాంగ్రెస్ నేతల ప్లాన్.
తుమ్మిడిహెట్టి నుంచి వార్ధాకు మారిన ప్రతిపాదన
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు బ్యారేజీని కాళేశ్వరానికి తరలించడం వల్ల భూ సేకరణ కోసం వెచ్చించిన మొత్తంతో పాటు అప్పటికే నిర్మాణాలు పూర్తయిన కాలువల వల్ల సుమారు రూ.10వేల కోట్లు వృథా అయ్యాయనేది కాంగ్రెస్ వాదన. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీరందడంతో పాటు చేవెళ్ల వరకు రూ.38వేల కోట్లతో నీటి సరఫరా జరిగేదని నేతల విమర్శ. వీటన్నింటికన్నా... తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తయితే పాత ఆదిలాబాద్ జిల్లాలోని 2లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందే అవకాశం ఉండేదన్న అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది.
ఇదే కాళేశ్వరం వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న ఆయకట్టు కన్నా ఎకరా అదనంగా రాదని ప్రచారం చేయబోతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ప్రాణహిత–చేవెళ్ల మరోసారి ఎన్నికల ప్రచారాస్త్రంగా మారనుంది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత బ్యారేజీ ప్రతిపాదిత స్థలాన్ని ప్రభుత్వం ఇటీవలనే తుమ్మిడిహెట్టి నుంచి దానికి ఎగువన గల వార్ధా నదిపైకి మార్చడం తెలిసిందే.