ప్రాణ‘హితం’ ఎలా? | cm kcr thinks pranahitha - chevella project | Sakshi
Sakshi News home page

ప్రాణ‘హితం’ ఎలా?

Published Sat, May 9 2015 1:02 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

ప్రాణ‘హితం’ ఎలా? - Sakshi

ప్రాణ‘హితం’ ఎలా?

ప్రత్యామ్నాయాలపై
కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష


హైదరాబాద్: ‘ప్రాణహిత-చేవెళ్ల’కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టుపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో రాత్రి 11.30 గంటల వరకు దాదాపు ఆరున్నర గంటల పాటు ఇది కొనసాగింది. నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు, ఢిల్లీ నుంచి వచ్చిన సర్వే సంస్థ వ్యాప్కోస్ చైర్మన్ సహా ఇతర ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో కేసీఆర్  చర్చించారు. ప్రత్యామ్నాయ ప్రాజెక్టు సర్వే నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కోరిన మీదట ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.

ముంపు ప్రాంతాల సాకుతో ప్రాజెక్టు పాత డిజైన్‌పై పొరుగున ఉన్న మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతున్న దృష్ట్యా కొత్త ప్రతిపాదనలపై రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి 116 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లికి కాకుండా, 110 కిలోమీటర్ల దూరాన ఉన్న కాళేశ్వరం దిగువన మేటిగడ్డకు నీటిని మళ్లించాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త డిజైన్‌పై సమగ్ర నివేదిక తయారీ బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థ ఇంజనీర్లు 20 రోజులుగా మేటిగడ్డ ప్రాంతం లో నీటి లభ్యత, ప్రవాహ పరిమాణం, పర్యావరణ అనుకూలతలు తదితరాలపై సర్వే చేస్తున్నారు. ఈ నివేదిక రావడానికి మూడు నెలల సమయం పడుతుందని గతంలోనే సర్వే సంస్థ వెల్లడించింది.

అయితే శుక్రవారం ఢిల్లీలో సీఎంతో భేటీ సందర్భంగా ప్రత్యామ్నాయ ప్రతిపాదనల నివేదికను తమకు త్వరగా సమర్పించాలని కేంద్ర మంత్రి ఉమాభారతి సూచించారు. దీంతో ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాగానే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. సమావేశ వివరాలు బయటకు తెలియరాకున్నా, వీలైనంత త్వరగా నివేదికను అందజేయాలని సీఎం సూచించిన ట్లు సమాచారం. అయితే తమ కు కనీసం రెండు నెలల సమయం కావాలని వ్యాప్కోస్ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
 
జాతీయ హోదా ప్లీజ్
న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రమశక్తి భవన్‌లో ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీ కవిత, రాష్ర్ట నీటిపారుదల శాఖ సలహాదారుడు విద్యాసాగర్‌రావు, కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాం, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు మాదిరిగా తెలంగాణలోనూ ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం అమలు, దానిప్రయోజనాలను కేసీఆర్ వివరించారు. వరంగల్‌లో నిర్మించిన మిషన్ కాకతీయ స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఉమాభారతిని ఈ సందర్భంగా ఆహ్వానించారు. అలాగే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 297 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ఏఐబీపీ(ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) కింద రావాల్సిన పెండింగ్ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలను కేంద్ర మంత్రి సానుకూలంగా విన్నారని ఈ సమావేశం అనంతరం ఎంపీ కవిత మీడియాకు తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కాంక్షించిన వ్యక్తిగా, తెలంగాణలోనూ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ఆకాంక్షతో ఉన్నట్లు ఉమాభారతి చెప్పారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఏఐబీపీ నిధుల విడుదలకు మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. రాష్ర్టంలో ఓ జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్న ఆకాంక్షతో కేంద్రం ఉందని, దానికి అనుగుణంగా ప్రాణహిత-చేవెళ్ల లే దా మరేదైనా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ర్టం తరఫున పంపిస్తామన్నారు. ఏ అంశంలోనైనా పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని కవిత వ్యాఖ్యానించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలోనూ భ విష్యత్తులో మహారాష్ట్రతో ఇబ్బందులు రాకుండా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. కాగా, కేసీఆర్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement