కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వినతి
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కోరారు. అదేవిధంగా మూసీ రివర్ డెవలప్‌మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలని.. రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) పూర్తి చేసేందుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) నిధుల విడుదల విషయంలో కొన్ని రాష్ట్రాలపట్ల పక్షపాతం చూపరాదని కేంద్రానికి సూచించారు. సీఎస్‌ఎస్ కింద రాష్ట్రానికి 2023–24కిగాను రూ.4.60 లక్షల కోట్లను విడుదల చేయాల్సి ఉండగా రూ. 6,577 కోట్లు మాత్రమే (1.4 శాతమే) విడుదలయ్యాయని అన్నారు.
రాష్ట్ర జనాభా ప్రాతిపాదికన చూసినా ఇది చాలా తక్కువని.. అందువల్ల సీఎస్‌ఎస్ కేటాయింపులను జనాభా నిష్పత్తి ప్రకారం, నిర్ణీత సమయంలో తెలంగాణకు విడుదల చేయాలని కోరారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహాక సమావేశం, జీఎస్టీ కౌన్సిల్ భేటీకి భట్టి విక్రమార్క రాష్ట్ర అధికారులతో కలసి హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి భేటీ వివరాలు వెల్లడించారు.
వెనకబడిన జిల్లాల నిధులు విడుదల కాలేదు
ఏపీ పునర్విభజన చట్టం–2014 సెక్షన్ 94 (2) కింద తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు రావాల్సిన రూ. 2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదని, వాటిని విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి ఇచ్చిన గ్రాంటును వచ్చే ఐదేళ్లు పొడగించాలని కోరామన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది సీఎస్‌ఎస్ గ్రాంట్ల రూపంలో తెలంగాణ కోసం విడుదలైన రూ. 495.21 కోట్లను కేంద్రం పొరపాటుగా ఏపీకి విడుదల చేసిందని.. ఈ మొత్తాన్ని త్వరగా తెలంగాణకు తిరిగి ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని నవోదయ పాఠశాలలను కేటాయించాలని.. ప్రధాని సూర్యఘర్ పథకంలో విద్యుత్ సబ్సిడీ, ముఫ్తీ బిజిలీ పథకం కింద రా>ష్ట్ర సబ్సిడీ నిధులను రూటింగ్ చేయడానికి సహకరించాలని కోరినట్లు భట్టి వివరించారు.
వీటికి జీఎస్టీ మినహాయించండి
నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణాలకు జీఎస్టీని తొలగించాలని లేదా తగ్గించాలని కోరారు.
అలాగే తెలంగాణలో వాడే ఫెర్టిలైజర్‌పై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. బీడీ ఆకులపైనా జీఎస్టీని తగ్గించాలని కోరారు. అదనపు ఆల్కహాల్ (ఈఎన్‌ఏ)ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలన్నారు. అవగాహనలేమి వల్ల ఆలస్యంగా పన్ను చెల్లించిన వారిపై విధించిన పన్ను, జరిమానా, వడ్డీని కొన్ని షరతులకు లోబడి మినహాయించే ప్రతిపాదనపై జరిగిన చర్చలో పాల్గొని మద్దతు తెలిపారు.
కొత్తవి పథకాలు ప్రవేశపెట్టండి
కేంద్ర ప్రాయోజిత పథకా (సీఎస్‌ఎస్)ల్లో షరతు లు, పరిమితులు విధించకుండా తెలంగాణకు వెసు లుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు భట్టి చెప్పారు. సీఎస్‌ఎస్‌లను సమీక్షించి అనవసరమైన పథకాలను తొలగించి కొత్త పథకాలను ప్రవేశపెట్టా ల్సిన అవసరం ఉందని సూచించినట్లు చెప్పారు. ఆర్థిక సంఘాల సిఫారసుల ప్రకారం... పన్ను విభ జనలో ఆయా రాష్ట్రాలకు వాటా తగ్గిందన్నారు.
కేంద్రం సెస్, సర్‌చార్జీల రూపంలో పన్నులు సేకరి స్తోందని.. ఇందులో రాష్ట్రాల వాటా పొందుపరచక పోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నా రు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణపరిమితిని, సీలింగ్‌ని తెలియజేయాల ని.. దీనివల్ల రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ వనరులను సమర్థంగా ఖర్చు చేసేలా ప్రణా ళికలు రూపొందించుకోగలుగుతాయని నిర్మలా సీతారామన్‌కు చెప్పామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment